రాజకీయాల్లో కొన్ని చర్యలు కాస్త విడ్డూరంగా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంలో టీడీపీ జోక్యం కూడా ఇదే కోవలో విడ్డూరంగానే ఉంది. టీడీపీ సోషల్ మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహ వైఖరి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. షర్మిలకు జగన్ ఆస్తులు పంచలేదు… అవి కుటుంబ ఆస్తులు కాబట్టి షర్మిల పోరాటం చేస్తున్నారు. ఈడీ కేసుల్లో లేని ఆస్తులు తనకు పంచాల్సిందే అని షర్మిల డిమాండ్ లు చేస్తున్నారు. దానికి టీడీపీ సోషల్ మీడియా మద్దతు ఇస్తోంది. ఆడపిల్లల ఏడుపు మంచిది కాదు, కన్న తల్లిని కోర్ట్ కు లాగడం వంటి కామెంట్స్ బోనస్.
షర్మిలకు మద్దతు ఇచ్చే ముందు టీడీపీ సోషల్ మీడియా కొన్ని ఆలోచించాల్సింది. ఆ ఆస్తులు అక్రమ ఆస్తులు.. అంటే ప్రజల ఆస్తులు. 2004 తర్వాత… అంటే వైఎస్ సిఎం అయిన తర్వాత వచ్చిన ఆస్తులు అవి. సాక్షి గాని, భారతి సిమెంట్స్ గాని, సరస్వతి పవర్ గాని ఏదైనా ఆ జాబితాలో నుంచి వచ్చినవే. సరస్వతి సిమెంట్స్ ఒక్కటే కేసుల్లో లేదు. అవన్నీ నాన్న నలుగురు పిల్లలకు అన్నారు… కాబట్టి మీరు పంచాలి అని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఆ ఆస్తుల కోసం నేను జైలుకు వెళ్ళా అని జగన్ అంటే… నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేశా అని షర్మిల అంటున్నారు.
Also Read : రోధిస్తున్న తల్లి.. క్షోభిస్తున్న వైఎస్ఆర్ ఆత్మ..!
అది పంచుకుంటారో, లేదా ఇద్దరూ కలిసే వాటిని అనుభవిస్తారో… అసలు ప్రభుత్వాలే లాక్కుంటాయో ఎవరికి క్లారిటీ లేదు. ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న కామెడీతో ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజల వద్ద లాక్కున్న భూములను నువ్వు ఒక్కడివే అనుభవించకు, షర్మిలకు కూడా ఇవ్వు.. లేదంటే ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు అని సలహా ఇస్తోంది టిడిపి. ఈ విషయంలో టీడీపీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు టీడీపీ డిమాండ్ చేయాల్సింది… జగన్ బెయిల్ రద్దు చేయాలని, జగన్ కోర్ట్ కు విచారణకు హాజరు కావడం లేదని, ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఆయన కోర్ట్ కు వెళ్ళడం లేదని విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేయాలి. ఆస్తులను త్వరగా జప్తు చేయమని కోరాలి.
ఇవేమీ లేకుండా షర్మిలకు ఆస్తులు ఇవ్వమని అడగడం, వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో జగన్ తప్పులు చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉంది. అది కూడా టిడిపి అధికార హ్యాండిల్ లో ఒకటికి పది సార్లు పోస్ట్ చేయడం చూస్తుంటే ఇది వారికంటే వీరికి ఎక్కువ నొప్పిగా ఉన్నట్లు కనిపిస్తుంది చూసే వాళ్ళకి. అసలు షర్మిల పై టిడిపి కి ఎందుకు ఇంత ప్రేమ అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. షర్మిల తో కలిసి టీడీపీ ఈ నాటకం ఆడుతుంది అని జగన్ చేసిన ఆరోపణలు నిజం అని ప్రజలు భావించే అవకాశం కూడా ఉంది. టిడిపికి చేతనైతే అధికారంలో ఉండగా జగన్ చేసిన అవినీతి, అక్రమాలు చట్టపరంగా రుజువు చేసి చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలాంటి వ్యవహారాల్లో అధికారికంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే నష్టపోవాల్సి వస్తుందని గుర్తుంచుకుంటే మంచిది.