ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. ఇప్పుడు ఈ వివాదం ఎటు తిరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కాని పరిస్థితి. ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ చేసిన పాపాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా పక్కన పెడితే ప్రజలకు జరిగిన నేరాన్ని వివరించాల్సిన అవసరం ఉంది. అది ఏం చిన్న వివాదం కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ కూటమి పార్టీల విషయంలో ఇప్పుడు పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మినహా ఎవరూ మాట్లాడటం లేదు. ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, నిరసన కార్యక్రమాలను బలంగా చేయాలి, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు లేవు, పార్టీ మీటింగ్ లు లేవు. నేతలు అందరూ ఖాళీగానే ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా బలంగా మాట్లాడే అవకాశం ఉన్న ఏ ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఏదో కంటి తుడుపుగా కొందరు నేతలు ప్రసంగాలు చేయడం మినహా లడ్డు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం జరగడం లేదు.
Read Also : హైడ్రా హడల్… ఆ భవనాలు కూడా నేలమట్టం
గతంలో ఇలాగే భారం మొత్తం చంద్రబాబుపై నెట్టి పార్టీని ఓడించారు. ఇప్పుడు మాట్లాడితే ఎవరూ వద్దు అనరు. కనీసం చిత్తూరు జిల్లా నేతలు కూడా మాట్లాడటం లేదు. రాయలసీమ జిల్లాల్లో మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు కనీసం తమ నియోజకవర్గాల్లో కూడా సైలెంట్ గా ఉంటున్నారు. భయపడే పరిస్థితి లేదు మాట్లాడితే ఆపే వాళ్ళు కూడా లేరు. అటు జనసేన, బిజెపి నేతలు కూడా కనీసం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా ఏపీలో మాత్రం మౌనం పాటించడం ఆశ్చర్యం కలిగించే విషయం.




