వెనుకబడిన జిల్లాలు, కరువు పీడిత జిల్లాలు, మన్యం ప్రాంతాలు.. ఈ మాటలు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదే పదే వింటూనే ఉంటాం. ఈ జిల్లాలపై ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ప్రత్యేక ప్రేమ ప్రదర్శించడం సహజంగా జరిగేదే. పారిశ్రామికాభివ్రుద్ది, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పదాలతో భారీగా నిధులు కేటాయిస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లలో పైన చెప్పిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. ఒకప్పుడు మావోయిస్ట్ ల ప్రభావం, ఆ తర్వాత వెనకబాటుతనం ఇలా కొన్ని కారణాలతో నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఈ నిధులు భారీగా వెళ్తాయి. స్పెషల్ ప్యాకేజీలు, రైల్వే జోన్ లు, కొత్త పరిశ్రమలు.. ఇలా ఏదోక రూపంలో ఈ ప్రాంతాలకు నిధులు వెళ్తాయి. భౌగోళిక, సామాజిక కారణాలతో ఆ నిధులు ఇవ్వడంలో ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ.. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మాత్రం.. మొండి చేయి అనడం కంటే అంతకు మించిన అన్యాయం జరుగుతోందనే మాట అక్షరాలా నిజం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో ప్రత్యేక ప్రేమ ప్రదర్శించడం.. కోస్తా ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోంది.
Also Read : పాకిస్తాన్ పరువు తీసిన భారత హీరోలు..!
తాజాగా సిఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎకనామిక్ కారిడార్ అభివృద్ధి, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ఓ సారి చూద్దాం. విశాఖపట్నంకు ఎకనామిక్ కారిడార్ ఇందులో భాగంగా ఫోకస్ చేసేవి.. గ్రీన్ హైడ్రోజెన్ పెట్రో కెమికల్స్, ఐరన్, స్టీల్, ఐటీ, షిప్ నిర్మాణ తదితర రంగాలు. ఇక రాజధాని అమరావతికి ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఫైనాన్స్, క్వాంటం వ్యాలీ, డీప్ టెక్నాలజీ, రూరల్ ప్రాంతాల అభివృద్ధి, ఇక రాయలసీమలోని తిరుపతి ఎకనామిక్ కారిడార్ లో భాగంగా స్పేస్, ఎలక్ట్రానిక్, సెమికండక్టర్స్, డిఫెన్స్, టూరిజం రంగాలను అభివృద్ధి చేస్తారు.
ఈ ప్రసంగంలో గాని, ఈ పవర్ పాయింట్ లో గానీ ఎక్కడా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రస్తావన లేదు. కేవలం రాజధాని అమరావతి ప్రాంతాన్ని మాత్రమే ప్రస్తావించారు సిఎం. దీనిపై పరిశీలకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అనే పేరు మాత్రమే ఈ జిల్లాలకు పరిమితం అయింది. నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ వాటికి వరాలను మాత్రం సిఎం చంద్రబాబు ప్రకటించలేదు. అటు కేంద్రం సైతం ఈ ప్రాంతాల విషయంలో ఓ రకమైన వివక్ష ప్రదర్శిస్తోంది.
Also Read : మీరేం ప్రజా ప్రతినిధులు సార్..?
వస్తున్న పరిశ్రమలను, కేంద్రం ఇస్తున్న నిధులను సైతం మొత్తం ఆయా ప్రాంతాలకే రాష్ట్రం ఖర్చు చేస్తోంది. కియా సహా పలు కీలక కంపెనీలను రాయలసీమ ప్రాంతానికి తరలించారు. ఇక ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు. గత 5 ఏళ్ళలో ఆ ప్రాంతాలతో పాటుగా ఈ ప్రాంతాలకు అన్యాయం జరిగినా సరే చంద్రబాబు సర్కార్ మాత్రం.. రాజకీయ కారణాలతో నిధులను పదే పదే ఆయా ప్రాంతాలకే కేటాయించడం ఆశ్చర్యం కలిగించే అంశం. సామాజిక వర్గ రాజకీయాలతో ఇప్పటికే ఈ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశించిన మేర అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కమ్మ సామాజిక వర్గం సాకుతో పరిశ్రమలను ఈ ప్రాంతానికి దూరం చేస్తోంది ప్రభుత్వం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది.. అందులో ఈ జిల్లాల్లో కూడా ఉంది. కానీ, వస్తున్న పారిశ్రామిక వేత్తలకు, తీసుకు రావాలనుకున్న పారిశ్రామిక వేత్తలకు భూములను ఆయా ప్రాంతాలకే కేటాయించడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతానికి మాత్రం నిధులను, పరిశ్రమలను కేటాయించే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు ప్రభుత్వం.