ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి స్థానంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ పదవి కోసం ఇప్పటి వరకు పది మంది పేర్లు వినపడగా.. ఎవరిని ఖరారు చేయవచ్చు అనే దానిపై మాత్రం అసలు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పది రోజులకో పేరు బయటకు వస్తోంది గాని, కూటమి పార్టీల ఆలోచన ఎలా ఉంది అనే దానిపై మాత్రం నేటి వరకు క్లారిటీ రాలేదు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినపడింది. ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనను ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: జగన్‌కు పబ్లిసిటీ పీక్స్.. ఊరు వాడా ఇదే టాపిక్..!
చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేత కావడం, ఢిల్లీ వర్గాల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉండటంతో ఆయనను ఫైనల్ చేస్తారని ఆశించారు. కానీ ఆయన కమ్మ సామాజిక వర్గం కావడంమే ఆయనకు శాపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం విషయంలోనే చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఖరారు చేయవచ్చని అన్నారు. ఆయనకు ఏకంగా సిఎంగా పని చేసిన అనుభవం కూడా ఉంది. బలమైన వాగ్దాటి కూడా ఆయన సొంతం. అందుకే ఆయన పేరుని ఫైనల్ చేయవచ్చని భావించారు. కానీ ఇప్పుడు టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి… మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తే… రంగా హత్య విషయంలో కొన్ని విమర్శలకు చెక్ పెట్టినట్టు అవుతుందని కూడా భావిస్తున్నారు. అలాగే జగన్ అన్యాయం చేసినా… రాధా భవిష్యత్తుకు టీడీపీ భరోసా కల్పించినట్లు అవుతుందని టిడిపి అధిష్టానం భావిస్తుంది. రంగా కుటుంబాన్ని రాజకీయాల్లో అన్ని పార్టీలు వాడుకున్నా ఇప్పటి వరకు మంత్రి పదవి ఆ కుటుంబానికి రాలేదు. వైఎస్ గాని, ఆ తర్వాత జగన్ గాని, కాంగ్రెస్ గాని రాధను గుర్తించలేదు అనే అభిప్రాయం కూడా రంగా అభిమానుల్లో ఉంది. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి కేబినేట్ లోకి తీసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని, రంగా కుటుంబాన్ని గౌరవించినట్లు అవుతుందని టీడీపీ అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది.