బోరుగడ్డ అనిల్… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. తన నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేశాడు. పైగా జగన్ కనుసైగ చేస్తే చాలు… అరగంటలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను లేపేస్తా అంటూ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశాడు కూడా. పేరుకు కనీసం ఒక్క ఓటు కూడా లేని పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ… జగన్ వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా దళిత కార్డును అడ్డుపెట్టుకుని గుంటూరు జిల్లాలో చేయని అరాచకం లేదు. బెదిరింపులు, దాడులు, కబ్జాలు… ఇలా ఒకటేమిటి… ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరించాడు బోరుగడ్డ అనిల్.
Also Read : వైసీపీ స్పెషల్ గేమ్… బూతులే ప్రజా సమస్యలంట..!
సోషల్ మీడియాలో అయినా సరే ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు… వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించి వేధించాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు అరండల్ పేట పోలీసులు బోరుగడ్డను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను గుంటూరు అరండల్ పేట పోలీసులు గతంలో విచారించారు. అయితే ఆ విచారణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఓ రిమాండ్ ఖైదీలా కాకుండా… ఓ వీఐపీల బోరుగడ్డను ట్రీట్ చేశారు అరండల్ పేట పోలీసులు. నిద్ర పోవడానికి పోలీస్ స్టేషన్‌లో ఓ టేబుల్ ఏర్పాటు చేసి… బెడ్, దుప్పటితో పాటు ప్రత్యేకంగా టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టారు.
ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు పోలీసులు. ఇక ఆ తర్వాత మరో రెండు రోజులకు స్టేషన్‌లో కుర్చీలో దర్జాగా కూర్చున్న బోరుగడ్డ కోసం ఓ మైనర్ కుర్రాడు వచ్చాడు. వాస్తవానికి రిమాండ్ ఖైదీలను కలవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. కానీ పోలీసులు మాత్రం కుర్రాడిని బోరుగడ్డ పక్కన కూర్చొబెట్టారు. ఆ అబ్బాయితో దాదాపు గంటకు పైగా బోరుగడ్డ మాట్లాడి పంపేశారు. ఇక తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. స్టేషన్‌లో దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చున్న బోరుగడ్డ… కానిస్టేబుల్‌ను భయ్యా ఒక టీ అని ఆర్డర్ వేశాడు. అడిగన వెంటనే రెండు నిమిషాల్లో ఆ కానిస్టేబుల్ టీ తీసుకొచ్చాడు.
Also Read : పుష్ప పేరుతో వైసీపీ సోషల్ మీడియా పొలిటికల్ వార్
ఇదంతా స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఇదంతా స్టేషన్‌లో డీఎస్పీ ఉండగానే జరిగినట్లు తెలుస్తోంది. స్టేషన్‌లో రౌడీ షీట్ ఉన్న రిమాండ్ ఖైదీకి ఇలా రాచమర్యాదలు ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు… కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అయితే బోరుగడ్డకు ఇలా రాచమర్యాదల వెనుక పోలీసు పెద్దల హస్తం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ దగ్గర గట్టిగానే నజరానాలు తీసుకున్న పోలీసు పెద్దలు… ఇప్పుడు అడుగులకు మడుగులు వత్తుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోరుగడ్డ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.




