టాలీవుడ్‌లో థియేటర్ల బంద్ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. ఏపీలో జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ స్క్రీని థియేటర్లు బంద్ చేస్తున్నట్లు వచ్చిన ప్రకటన.. అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు సినీ పరిశ్రమలో కూడా ప్రకంపనలు రేపుతోంది. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సమయంలోనే థియేటర్ల బంద్ ప్రకటన పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. అసలు థియేటర్ల పరిస్థితి ఏమిటీ.. ఏం జరుగుతోంది.. ఈ బంద్ ప్రకటన వెనుక ఎవరున్నారు.. అసలు థియేటర్ల పరిస్థితులేమిటీ అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అలాగే ప్రతి సినిమాకు టికెట్ల ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని సూచించారు.
Also Read : స్పిరిట్ నుంచి దీపిక అందుకే తప్పుకుందా..?
థియేటర్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలంటూ పవన్ అభిప్రాయం అభినందనీయమన్నారు. దీనిని అందరూ స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలని దిల్ రాజు సూచించారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ అంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతామన్నారు దిల్ రాజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు.
Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్
ఇక థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వామిగా ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి జనసేన పార్టీ నేత అత్తి సత్యనారాయణపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలో సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చిన ఆరోపణలు సత్యమా.. ఆసత్యమా అని నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ జనసేన పార్టీ నేత వేములపాటి అజయకుమార్ పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయంపై అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ ప్రకటన వెనుక తన ప్రమేయం లేదనీ వివరణ ఇచ్చుకున్నారు. సున్నితమైన ఈ వ్యవహారంలో తనను ఇరికించారనీ.. థియేటర్ల బంద్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని వాపోయారు. దీని వెనుక గల వ్యక్తులు, కారణాలను బయటపెట్టారు.
Also Read : కవిత కొత్త పార్టీకి ముహుర్తం ఖరారు..!
జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చింది తాను కాదని.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని అత్తి సత్యనారాయణ తెలిపారు. తన తమ్ముడుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దిల్ రాజు తనపై ఈ అభాండం వేశారని, తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ ప్రకటన వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందన్నారు సత్యనారాయణ. ఈ విషయంలో నేరుగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో.. తన సోదరుడిని కాపాడుకునేందుకు దిల్ రాజు జనసేన పార్టీ పేరు ప్రస్తావించారన్నారు. థియేటర్లను బంద్ పెట్టాలంటూ గత ఏడాది శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ సంతకాలు సైతం చేశారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు.