అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామన్నారు… ఐదేళ్ల పాలనలో జరిగిన ప్రతి అరాచకానికి బదులు తీర్చుకుంటామన్నారు… వైసీపీ అక్రమాలకు బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు… మరి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది.. ఏ కేసు ఎంత వరకు వచ్చింది… ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ ఎంత వరకు వచ్చింది… ఇప్పుడు ఇదే ప్రశ్నలు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు… యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో రెడ్ బుక్ చూపించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చివరికి అధికారులను బెదిరిస్తున్నారంటూ కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే ఇదంతా ఐదు నెలల క్రితం మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ ఏమయ్యాయో తెలియటం లేదు.
కాకినాడ కేంద్రంగా పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరిగిందని… ఇందులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలక పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం కేసులో నాటి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసు విచారణ ఇప్పటికే కోర్టులోనే ఉంది. డాక్యుమెంట్స్ కుక్కలు ఎత్తుకెళ్లాయంటూ అప్పట్లో ప్రచారం చేశారు. ఇక ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చెరువు కబ్జా చేశారంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. వీటన్నిటికీ తోడు టీడీపీ నేతలపై దాడులు, హత్యలకు సంబంధించిన కేసుల్లో నిందితులను ఎప్పుడు పట్టుకుంటారనేది కార్యకర్తలు, బాధితుల ప్రశ్న. తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయని, దర్శనం టికెట్ల కుంభకోణం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ అవేవి ఇప్పుడు ప్రస్తావించకుండా… శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై మాత్రమే విచారణ చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే… విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్ కేసు విచారణ ఏమైందో చెప్పాలంటూ ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఏకంగా ప్రతిపక్ష నేత కేసుల విచారణ ఏమైందంటూ ప్రశ్నించడం ఏమిటని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.




