ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. అసలు ఆయన మన పార్టీలోనే ఉన్నారా.. ఇప్పటి వరకు ఆయన మన పార్టీ జెండా ఎందుకు కప్పుకోలేదు.. మన నేతను తిట్టిన వారితోనే ఆయన ఎందుకు కలిసి తిరుగుతున్నారు.. ఇలాంటి వారి పైన పార్టీ అధినేత ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.. ఇవే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతున్న ప్రశ్నలు. ఇంతకీ ఆ నేత ఎవరనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో ఓ గుర్తింపు ఉన్న నేత.. ఆయన వంగవీటి రాధాకృష్ణ. ప్రస్తుతం రాధా ఏ పార్టీలో ఉన్నారు.. ఏం చేస్తున్నారు అనేదే ఇప్పుడు బిగ్ డౌట్.
Also Read : బ్రేకింగ్: నిన్న నో.. నేడు ఎస్.. మరో కరూర్ కి పోలీసులు రెడీ నా ?
వంగవీటి రాధాకృష్ణ.. వంగవీటి మోహన్ రంగా రాజకీయ వారసునిగా వచ్చిన రాధా.. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాధ.. 2008లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాధ.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతుల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత విజయవాడ నగర వైసీపీ అధ్యక్షునిగా.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయ కర్తగా కూడా పని చేశారు. అయితే వైసీపీలో సరైన గుర్తింపు రాకపోవడంతో..2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు రాధ.
నాటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే, పార్టీ తోనే రాధ ఉన్నారు. 2019, 2024 ఎన్నికల్లో రాధకు టీడీపీ టికెట్ రాలేదు. కానీ రాధాను స్టార్ క్యాంపెయినర్‌గా టీడీపీ ప్రకటించింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే రాధా తీరు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2019 ఎన్నికల తర్వాత రాధ పలుమార్లు గుడివాడలో పర్యటించారు. గుడివాడలో ఒక సామాజిక వర్గం నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా. దీంతో రాధా గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ 2024 ఎన్నికల నాటికి సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. చివరి నిమిషంలో వెనిగళ్ల రాము తెరపైకి వచ్చారు. నాటి నుంచి రాధా మాత్రం సైలెంట్‌గానే పార్టీలో కొనసాగుతున్నారు.
Also Read : తెలంగాణలో దున్నపోతు దుమారం..!
ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు చట్టసభల్లో అవకాశం వస్తుందని అంతా భావించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు రాధాను టీడీపీ తరఫున పంపిస్తారనే పుకార్లు షికారు చేశాయి. ఇదే సమయంలో రాధా హత్యకు రెక్కీ వేశారంటూ కొన్ని వీడియోలు వెలుగులోకి రావడం పెద్ద కలకలం కూడా రేపింది. ఆ తర్వాత అనూహ్యంగా లోకేష్‌ను రాధా స్వయంగా కలిశారు. రాధా ఇంటికి కూడా లోకేష్ వెళ్లి పరామర్శించారు. దీంతో రాధా కూడా కాస్త చల్లబడ్డారు. అయితే నాటి నుంచి రాధా రాజకీయాలకు దూరంగా ఉన్నారనే చెప్పాలి. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు. చివరికి విజయవాడలో సీఎం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా రాధా దూరంగా ఉంటున్నారు.
ఇక రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వంగవీటి రాధ కుమార్తె రుధిర బారసాల వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీడీపీ నేతల కంటే.. వైసీపీ నేతలే ఎక్కువగా పాల్గొన్నారు. వీరిలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజ సహా పలువురు వైసీపీ నేతలున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాధా, నాని, వంశీ ముగ్గురు తొలి నుంచి మంచి మిత్రులు. ఈ విషయం అందరికీ తెలుసు. పలు సందర్భాల్లో ఈ ముగ్గురు కలిసే చాలా వేడుకల్లో పాల్గొన్నారు కూడా. ఇక రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మిత్రులు ఉన్నారు. వీరిలో చాలా వరకు కాంగ్రెస్, వైసీపీకి చెందిన వారే.
Also Read : వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!
ఇప్పుడు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొందరు టీడీపీ అభిమానులు.. రాధా తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాధ మెడలో టీడీపీ కండువా వేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ జెండా పట్టలేదు. మరోవైపు వైసీపీ వారితో తిరుగుతున్నారు. ఇంతకూ పార్టీలో ఉన్నట్లా.. లేనట్లా.. అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. పార్టీ అధినేతను దూషించిన వారితో తిరగడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీనిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటున్నారు కూడా. అసలు రాధా టీడీపీలో ఉన్నారా.. అని కొందరు ప్రశ్నిస్తుంటే.. అసలు రాధాకు పదవి యోగం ఉందా అనేది మరికొందరి అనుమానం. మరి ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారో చూడాలి.