పాపం పాకిస్తాన్… ఆ దేశ ఆర్థిక పరిస్థితి చూసిన ఏ ఒక్కరైనా సరే ఇదే మాట అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. దీంతో అప్పు కోసం పాక్ ఆర్థిక మంత్రి అన్ని దేశాలను వేడుకుంటున్నారు. అప్పు కోసం బ్యాంకులన్నిటినీ బతిమాలుతున్నారు. ఇక కొన్ని రోజులుగా ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్.. ఐఎంఎఫ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో పాకిస్తాన్‌కు 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ అప్పుగా ఇస్తానని చెప్పింది. అందులో ఇప్పటికే పది శాతం ఇచ్చింది కూడా. అయితే మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఐఎంఎఫ్‌ను పాకిస్తాన్ కోరుతోంది. అందుకోసం గతంలో ఖర్చు చేసిన బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎలా ఖర్చు చేశామనేది కూడా లెక్కలతో సహా వివరిస్తున్నారు.
Also Read : సౌత్ ఇండియా నయా స్టార్ సంజూ.. రికార్డులు బ్రేక్
పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమ దేశాన్ని గట్టెక్కించాలని ఆర్థిక మంత్రి తాపత్రయ పడుతున్నారు. అప్పు కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో పాటు సౌదీ అరేబియా, చైనా… ఇలా తమకు అనుకూలంగా ఉండే అన్ని దేశాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మరో భారం ఎదురుకానుంది. అసలే గడ్డుకాలం అనుభవిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ గుదిబండగా మారింది. ఐసీసీ లెక్కల ప్రకారం వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ ట్రోఫీ నిర్వహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం.. అది అసాధ్యం అంటున్నారు ఆర్థిక నిపుణులు. వాయిదా అన్నా వేయాలి.. లేదా మావల్ల కాదని ఐసీసీ చెప్పి రద్దు అయినా చేయాల్సిన పరిస్థితి.
కానీ ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా… పాక్ క్రికెట్ బోర్డు పెను ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. ఇప్పటికే చిన్న జట్ల చేతుల్లో కూడా ఓడిన పాక్ క్రికెట్ టీమ్.. పరువు పొగొట్టుకుంది. పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టు పంపేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ట్రోపీ జరగాలి. అయితే ప్రస్తుత అనిశ్చితి కారణంగా.. అసలు ట్రోఫీ జరుగుతుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. 1996లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్‌లో జరగాల్సిన ఐసీసీ టోర్నమెంట్ ఇదే. దీన్ని పాకిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ టోర్నమెంట్‌ను సక్సెస్ ఫుల్‌గా నిర్వహించడం ద్వారా తమ దేశంలో ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెప్పడమే పీసీబీ ప్రయత్నం.
Also Read : జాతీయ జట్టులో దుమ్మురేపుతున్న గుంటూరు కుర్రోడు
ఇలా చెప్పడం వల్ల పలు దేశాలు పాకిస్తాన్‌తో భవిష్యత్తులో మ్యాచ్‌లు ఆడతాయనేది పీసీబీ ఆశ. అయితే ఆటగాళ్లకు పంపేది లేదని బీసీసీఐ చెప్పడంతో తటస్థ వేదికల్లో కూడా భారత్‌తో ఆడేది లేదని పీసీబీ చెప్పడం వల్ల… మొత్తం టోర్నమెంట్ నిర్వహణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టోర్నమెంట్ వాయిదా పడినా… ఇతర దేశానికి తరలినా సరే… పీసీబీ పీకల్లోతు కష్టాల్లోకి పడుతుంది. ఐసీసీ ఆంక్షలకు గురవ్వడంతో పాటు, ఐసీసీ ఫండింగ్‌లో కోత కూడా పడుతుంది. టోర్నమెంట్ జరగకపోతే పీసీబీకి సుమారు రూ.550 కోట్లు నష్టపోతుంది. కరాచీ, రావల్పిండి, లాహోర్ లోని క్రికెట్ స్టేడియాలను కోట్లు ఖర్చు చేసి సిద్ధం చేసింది.
అయితే భద్రతా కారణాల వల్ల వచ్చేది లేదని బీసీసీఐ చెప్పడాన్ని పాకిస్తాన్ తప్పుపడుతోంది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తమ దేశంలో పర్యటించాయని… వాళ్లకు లేని సమస్య భారత్‌కు మాత్రమే ఎందుకు వస్తుందనేది పీసీబీ ప్రశ్న. మరోవైపు టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ దృష్టి సారించింది. ఇప్పటికే స్పాన్సర్ల నుంచి వచ్చే న్యాయపరమైన చిక్కులతో పాటు ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో వేదిక మారుస్తుందనే ప్రచారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.