తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు.
Also Read : పోటీ చేస్తున్నాం.. టీటీడీపీ కీలక ప్రకటన
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతం టికెట్ రూ.1000గా నిర్ణయించారు. ఒక టికెట్ పై ఇద్దరు భక్తులను అనుమతిస్తారు. ఈ కారణంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Also Read : చిన్న వయసులో గుండెపోటు.. హైదరాబాద్ లో విషాదం
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.