కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం ఏడుకొండల వాడి గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. ప్రతిరోజు సుమారు 70 వేల మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. హుండీ ఆదాయం కూడా రోజుకు రూ.3 కోట్లు పై మాటే వస్తుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలకు చెక్ పెట్టారు. గతంలో శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు గుర్తించిన అధికారులు… దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు బదిలీ వేటు వేశారు. అన్న ప్రసాద వితరణలో కీలక మార్పులు చేశారు.
Also Read : ఆనాడు యరపతనేని ఒక్కడే నిలబడ్డాడు.. బాబు సంచలన కామెంట్స్
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తుందని పాలక మండలి సభ్యులు పదే పదే చెబుతున్నారు. దర్శనం, గదుల కేటాయింపు సహా వంటి వాటిని మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఏఐ టెక్నాలజీ సహకారంతో ఇకపై భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకునేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుమలలో వేసవిని దృష్టిలో పెట్టుకుని మాడ వీధులు సహా ఇతర ప్రాంతాల్లో కూడా కూల్ పెయింట్ వేస్తున్నారు. అలాగే గతంలో నామ మాత్రంగా నిర్వహించిన క్యూ లైన్‌లో అన్న ప్రసాద వితరణ, పాలు, మజ్జిగ సరఫరాను పునరుద్ధరించారు. క్యూ లైన్‌లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : ఆ ఒక్క అరెస్ట్ ఎందుకు ఆగుతున్నట్టు…?
అయితే ఈ నేపథ్యంలో టీటీడీకి పలువురు భక్తులు కీలక విజ్ఞప్తులు చేస్తున్నారు. కొన్ని విషయాల్లో పాత పాలక మండలి తీసుకువచ్చిన విధానాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శనం విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఆన్‌లైన్ విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏ దర్శనం అయినా సరే 3 నెలలు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిందే. సేవలతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సీనియర్ సిటిజన్, గదుల బుకింగ్ కూడా ఆన్‌లైన్‌లో 3 నెలల ముందు విడుదల చేస్తోంది టీటీడీ. ఈ విధానం వల్ల ఎవరైనా సరే మూడు నెలల ముందే తిరుమల దర్శనం ప్లాన్ చేసుకోవాల్సిందే. అలా కుదరని పక్షంలో సర్వ దర్శనం లేదా కాలినడక మార్గంలో ఇచ్చే టోకెన్లు మాత్రమే అవకాశం. దీని వల్ల పెద్ద వాళ్లు తిరుమల వచ్చిన సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆధార్ కార్డు ద్వారా మధ్యాహ్నం సమయంలో నేరుగా ప్రత్యేక క్యూ లైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి సీనియర్ సిటిజన్లను అనుమతించారు. దీని వల్ల ఆన్‌లైన్ బుకింగ్ లేనప్పటికీ నేరుగా కొండకు వచ్చే పెద్ద వాళ్లు స్వామి వారిని దర్శించుకునేవారు. కానీ ఆన్‌లైన్ వల్ల అప్పటికప్పుడు వచ్చిన వారు స్వామి వారిని దర్శించుకోలేక పోతున్నారు. సర్వ దర్శనం క్యూలో గంటల తరబడి వేచి ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాత పద్దతిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆన్‌లైన్‌తో పాటు వయో వృద్ధులను, దివ్యాంగులను నేరుగా క్యూ లైన్ లోకి అనుమంతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.