కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీనివాసుని దర్శనం కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఏడుకొండల వాడి దర్శనం కోసం ఏకంగా గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూస్తారు కూడా. నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ నేత విచక్షణ కోల్పోయి వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సదరు నేత వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు నరేష్ కుమార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే నరేష్ కుమార్. ఈయనకు బీజేపీ కోటాలో టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కింది. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు నరేష్. ఈయనకు ప్రోటోకాల్ ప్రకారం దేవస్థానం అధికారులు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు కూడా. దర్శనం అనంతరం బయటకు వస్తున్న సమయంలో… ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. సదరు సభ్యులు నరేష్ కుమార్ కు అక్కడే ఉన్న చిరుద్యోగి పై కోపం వచ్చింది. అంతే.. ఆలయ మహా ద్వారం ఎదురుగానే బూతులతో రెచ్చిపోయారు నరేష్ కుమార్. ఉద్యోగి స్థాయిని కించపరిచే విధంగా గట్టి గట్టిగా కేకలు వేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఉద్యోగి పై రెచ్చిపోయారు. ఇక్కడ నుంచి బయటకు పంపుతారా లేదా అంటూ అక్కడే ఉన్న ఉద్యోగులపై రంకెలేశారు. పంపకపోతే ఇక్కడే కూర్చుంటా అంటూ బెదిరించారు కూడా. దీంతో.. తోటి ఉద్యోగులు చిరుద్యోగిని అక్కడ నుంచి పంపేశారు.
Also Read : రేవంత్ ను ఒంటరి చేసిన టీ కాంగ్రెస్
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణకు ఆదేశించారు. అసలు బోర్డు సభ్యులు నరేష్ కుమార్ కు కోపం ఎందుకు వచ్చిందో అనే విషయంపై విచారిస్తున్నారు. ఏది ఏమైనా… ఇలా శ్రీవారి సన్నిధిలోనే బూతులు మాట్లాడటం.. సాటి మనిషిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఆవేశం ఉన్న వ్యక్తి.. ఎక్కడున్నామనే విషయం కూడా గ్రహించలేని వ్యక్తి.. టీటీడీ బోర్డు సభ్యునిగా అనర్హుడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పవిత్రమైన శ్రీవారి సేవ నుంచి నరేష్ కుమార్ ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.