అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపుగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సినిమా రంగంపై ప్రభావం చూపుతున్న విదేశీ సినిమాలపై కఠిన వైఖరిని ప్రదర్శించారు ట్రంప్. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఆదివారం.. విదేశాల్లో నిర్మించిన అన్ని సినిమాలపై వంద శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read : రామ్ చరణ్ ను “గ్లోబల్ స్టార్” ట్యాగ్ భయపెడుతోందా..?
ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు గానూ.. వాణిజ్య శాఖ మరియు యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్‌టిఆర్) కు అధికారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అమెరికాలో గత ప్రభుత్వాలు.. అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఆర్థిక, జాతీయ భద్రతా ముప్పుగా అభివర్ణించారు ట్రంప్. అమెరికన్ సినిమా పరిశ్రమ చాలా వేగంగా మరణానికి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read : పెద్దిరెడ్డిని కాపాడుతున్న అధికారులు
దీనిపై సినీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ను గాడిలో పెట్టడం కంటే.. ఇది ఆ దేశ సినీ రంగాన్ని దెబ్బ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సుంకాల రూపంలో సినీ రంగానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రధాన స్టూడియోలకు ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బే. కరోనా దెబ్బ నుంచి ఆ దేశ సినీ పరిశ్రమ ఇంకా బయటపడలేదు. ఈ సమయంలో ట్రంప్ నిర్ణయం మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మన దేశం ఎక్కువగా అమెరికాపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అక్కడి వసూళ్లను టార్గెట్ గా చేసుకుని సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సమయంలో ట్రంప్ దెబ్బ గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయి.