గుంటూరు టాకీస్ సినిమాతోనే విజయం సాధించిన సిద్దు జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా నోట్ అవ్వలేదు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో, వెబ్ సిరీస్ లో నటించినా కానీ తగినంత పేరు మాత్రం ఈ హీరోకి రాలేదు. కానీ డీజే టిల్లు సినిమా సిద్దు కెరీర్ ని మొత్తం మార్చేసింది అని చెప్పుకోవచ్చు. అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరి దృష్టిని సిద్దు వైపు తిప్పింది.

ఇక వెంటనే ఆ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. కానీ సీక్వెల్ మొదలైన దగ్గర నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. దర్శకుడు దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు అందరూ సీక్వెల్ కి మారిపోయారు. సిద్దు తప్ప మొదటి పార్టీకి వర్క్ చేసిన ఎవరూ సీక్వెల్ కి పనిచేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో సిద్దు ఎక్కువగా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్లే ఇలా జరుగుతోందని కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి సిద్దు కానీ ఈ చిత్రం నిర్మాతలు గాని స్పందించలేదు. కానీ ఈ చిత్రం పైన ఉన్న అనుమానాలన్నీ తారుమారు చేస్తూ సీక్వెల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ మధ్యనే విడుదలైన టిల్లు స్క్వేర్ సిద్దు జొన్నలగడ్డ టైర్ 2 హీరోస్ లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిపింది. మొదటి పార్ట్ కన్నా ఎక్కువ కలెక్షన్ సాధించి ఈ చిత్రం మూడో భాగం కోసం ప్రేక్షకులు మరింత ఎదురు చేసేలా చూసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా మూడో పార్ట్ అయినా టిల్లు క్యూబ్ చుట్టూ కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి పార్ట్ నుంచి రెండో పార్థుకు వచ్చే ప్రయాణంలో ఎన్ని మార్పులు జరిగాయో ఇప్పుడు రెండో పార్ట్ నుంచి మూడో పార్ట్ కి వచ్చే ప్రయాణంలో కూడా అన్నే మార్పులు కనిపించేలా ఉన్నాయి.

ఇందుకు ముఖ్య కారణం ఇప్పుడు మూడో పార్ట్ కోసం మరో దర్శకుడిని తీసుకుంటున్నారు అని తెలియడం. ఇప్పుడు ఈ చిత్రం మూడో పార్ట్ కి దర్శకత్వం వహించడం కోసం ఓ యువ సూపర్ హిట్ దర్శకుడిని రంగంలోకి దించుతున్నారు. ఈ మధ్యనే ‘మ్యాడ్’ వంటి కామెడీ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ ని టిల్లు క్యూబ్ కోసం తీసుకొస్తున్నారని సమాచారం. సిద్ధూ కామెడీ టైమింగ్ కి కళ్యాణ్ శంకర్ కామెడీ రైటింగ్ తోడైతే ఇక నవ్వులే నవ్వులు అన్నట్టు చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

దర్శకుడితో పాటు హీరోయిన్ కూడా మారుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు పూజ హెగ్డే తో పాటు తమన్నా కూడా లిస్టులో ఉందని సమాచారం. అయితే హిందీలో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ లో ఒక ఊపు ఊపేసిన తమన్నా అయితే ఈ సినిమాకు బాగా సూట్ అవుతుందని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తమన్నా కూడా ఈమధ్య తనకి తాను పెట్టుకున్న హద్దులు చెరిపేసుకుని కుర్రకారుకి హీటెక్కించే విధంగా సినిమాలు, ఫోటో షూట్లు చేస్తుండటం సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో టిల్లూ ఈసారి ఏ పిల్లతో లొల్లి చేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు.




