ఇలా అయితే కష్టం… ఈ మాట తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఈ మాట అంటోంది కూడా పార్టీ కార్యకర్తలే. అధికారంలోకి వచ్చి నిండా నాలుగు నెలలు పూర్తి కూడా కాకముందే కొంతమంది నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కిందిస్థాయి క్యాడర్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏరు దాటే వరకు ఏటి మల్లన్న… ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు మీరే నా దేవుళ్లు అంటూ పొగడ్తల వర్షం కురిపించిన నేతలు… గెలిచిన తర్వాత కనీసం ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు.
మా ఎమ్మెల్యే సార్ దగ్గర ఏ పని అయినా జరుగుతుంది అనే ధీమా సగటు కార్యకర్తల్లో లేకుండా పోయింది. మా సార్ ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కొంతమంది నేతలైతే గెలిచిన తర్వాత కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన సందర్భాలు కూడా లేవు. ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అయితే ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు కూడా ఆహ్వానం అందటం లేదు. మన పార్టీ, మన ప్రభుత్వమే కదా అని ఎవరైనా నేతలు కాస్త చొరవ తీసుకుని వెళితే… అక్కడ కనీస మర్యాద, గౌరవం కూడా దక్కడం లేదంటున్నారు కార్యకర్తలు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారో అనే మాట కూడా ఇప్పటికే పార్టీలో సీనియర్లు పడ్డారు.
Also Read : జగన్ సుద్దపూస కబుర్లు.. నవ్విపోతున్న ప్రజలు
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా పాట్లు పడ్డారు. అదే సమయంలో టికెట్ తమకే రావాలంటే ముందు కార్యకర్తలను మచ్చిక చేసుకుని… వారి ద్వారా అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అయితే గెలిచిన తర్వాత అస్సలు లెక్క చేయడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యే సోదరులు, బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఏ పని కావాలన్నా సరే.. మాకు చెప్పండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. కొంతమంది అయితే నాకు చెబితే… ఆయనకు చెప్పినట్లే అంటూ నియోజకవర్గం పార్టీ పనుల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వేలు పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే…. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తప్పదంటున్నారు కింది స్థాయి నేతలు.




