తెలుగుదేశం పార్టీలో కొందరి సీనియర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన తమకు సరైన గుర్తింపు ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు కూడా ఇప్పుడు అధినేత పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తోంది. మరోవైపు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ శుభతరుణం ఎప్పుడా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన పదువులు వస్తాయని చాలా మంది నేతలు ఆశపడ్డారు. ఇందుకు ప్రధాన కారణం… పొత్తులో భాగంగా కొందరు నేతలు సీట్లు త్యాగం చేశారు. అలాగే కొందరు నేతలు ఎన్నో వ్యయప్రయాసలకు లోనయ్యారు. ఇక కొందరైతే… వైసీపీ సర్కార్‌లో జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు వీరంతా పదవులెప్పుడు ఇస్తారు బాబు గారు అని ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గం టికెట్‌ను త్యాగం చేశారు. ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పటికీ చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అది కాస్తా కొనకళ్ల నారాయణకు దక్కింది. దీంతో… దేవినేనికి ఎమ్మెల్సీ ఇస్తారా… లేక రాజ్యసభకు పంపుతారా అని నేతలు చర్చించుకుంటున్నారు.
Read Also : బాలినేని ఎఫెక్ట్ మామూలుగా లేదుగా….!
ఇక ప్రొద్దుటూరు టికెట్ ఆశించి భగపడిన డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు కూడా నామినేటెడ్ పదవి దక్కలేదు. ఏపీఐఐసీ వస్తుందని ఆశపడ్డారు… కానీ అది మంతెన రామరాజుకు కేటాయించారు. దీంతో ఆయన కూడా ఇప్పుడు నిరాశ పడుతున్నారు. రెండో జాబితాలో అయినా తన పేరు ఉంటుందని ఆశపడుతున్నారు. వీరితో మహిళా నేత ఆచంట సునీత సైతం పదవి కోసం ఎదురు చూస్తున్న వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ, డ్వాక్రా సాధికారిత కమిటీ ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2004 నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ… సరైన గుర్తింపు మాత్రం రాలేదనేది వాస్తవం. పార్టీ పదవులు వచ్చాయి తప్ప… నామినేటెడ్ పదవి మాత్రం దక్కలేదు.
అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి వస్తుందనే మాట బలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుత కమిషన్ సభ్యురాలి గజ్జల వెంకటలక్ష్మి హైకోర్టులో కేసు వేయడంతో… దాన్ని కోర్టు కొట్టివేయడంతో కొత్త కమిటీ వేయడానికి మార్గం సుగమం అయింది. గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, కిడారి శ్రావణ్, కిమిడి నాగార్జున, పరిటాల శ్రీరామ్, సుగుణమ్మ, ప్రభాకర్ చౌదరి, జేసీ పవన్ కుమార్ రెడ్డి వంటి నేతలంతా పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు, లోకేశ్ నిర్ణయం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజుులు వేచి చూడాల్సిందే.




