ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి చేరుకుంది. మొత్తం పది మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 6 మెడికల్ కాలేజీలు అప్పగించాలని మంత్రివర్గంలో తీర్మానం కూడా చేశారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పబడుతున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే.. మరో అడుగు ముందుకు వేశారు.
Also Read : నేపాల్ ఉద్యమం.. నష్టం ఎవరికీ..?
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకునేందుకు ఎవరైనా సరే ముందుకు వచ్చి టెండర్లు వేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లు రద్దు చేస్తామని కూడా వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పెట్టుబడిదారులను జగన్ బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బెదిరించి కంపెనీలు తరిమేశారని గుర్తు చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలకు ధీటుగా బదులిస్తున్నారు. తమ హయాంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని.. మిగిలిన వాటిని పూర్తి చేయకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని కూడా జగన్ విమర్శించారు.
అయితే ప్రెస్ మీట్ సమయంలో జగన్ కాలేజీల ఫోటోలు చూపించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆ వెంటనే.. టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ హయాంలో కట్టినట్లు చెప్పిన కాలేజీల ముందు సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక హోం మంత్రి అనిత కూడా కాలేజీలు కట్టలేదని మీడియా ముందు సగం కట్టిన భవనాలు చూపించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు తమ అధినేత బాటలోనే పయనిస్తున్నారు. ఒకరో ఇద్దరో తప్ప.. మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. చివరికి మాజీ మంత్రులు రోజా, విడదల రజని, సీదిరి అప్పల్రాజు వంటి నేతలు కూడా ఇంట్లో కూర్చుని తమ అనుకూల మీడియాతో మాట్లాడారు తప్ప.. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించలేదు. చివరికి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మెడికల్ కాలేజీ గురించి కూడా చెప్పలేకపోతున్నారు.
Also Read : సజ్జల ప్రకటనతో వైసీపీలో గందరగోళం..!
పులివెందుల కాలేజీకి కేంద్రం 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదని జగన్ ఆరోపించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం.. పులివెందుల కాలేజీ అసలు పూర్తి కాలేదని వీడియోలు పెడుతున్నారు. కానీ జగన్ సొంత నియోజకవర్గం వైసీపీ నేతలు కూడా కాలు బయటపెట్టడం లేదు. ఆసుపత్రి పూర్తి చేశామని గొప్పగా చెప్పటం లేదు. అంటే ఆసుపత్రి ఇంకా పూర్తి కాలేదని.. వైఎస్ జగన్ అబద్ధం చెబుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.