ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల ప్రాంతానికి కాస్త ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండే ప్రాంతం ఇది. వైఎస్ కుటుంబానికి కంచు కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో, టీడీపీ పాగా వేయడానికి అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ప్రయత్నం చేస్తూనే ఉంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగా, ఇప్పుడు జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుని వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఇది ఒకరకంగా వైఎస్ జగన్ కు ఇబ్బందికర పరిణామం గానే చెప్పాలి.
Also Read : నా భార్యతో రాజీనామా చేయిస్తా.. నీకు ఆ దమ్ముందా జగన్..?
ఇదిలా ఉంచితే.. ఈ నియోజకవర్గంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెలలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ చేరికలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి.. నియోజకవర్గంలో చేరికలు ఉంటాయని, త్వరలోనే కొత్త రాజకీయం చూస్తారని ప్రకటించారు. దీనితో నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామాలు ఉండవచ్చనే సంకేతాలు వచ్చాయి. బహిరంగ సభను ఓ కీలక మండలంలో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read : తప్పుడు పనులు చేస్తే వదలను.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
కడపలో మహానాడు నిర్వహించిన సమయంలోనే పులివెందుల బహిరంగ సభ గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఎలాగో జిల్లా పరిషత్ స్థానం కూడా గెలిచింది కాబట్టి, విజయోత్సవ సభగా దీనిని నిర్వహించే అవకాశం ఉండవచ్చని సమాచారం. పార్టీలో జాయిన్ అయ్యేందుకు కొందరు నాయకులు భయపడుతున్న నేపధ్యంలో వారికి ధైర్యం కల్పించేందుకు టీడీపీ ఈ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ గెలవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పని చేయాలని టీడీపీ భావిస్తోంది.