ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. కృష్ణా జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి కీలక నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించినా సరే.. ఆ పార్టీ కార్యకర్తలు అలాగే క్షేత్రస్థాయి నాయకులు పార్టీ నాయకత్వం పై నమ్మకం కోల్పోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ఎన్నో అంచనాలతో గెలిపించారు.
కాని సదరు ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న పార్టీ కార్యకర్తలు… అలాగే మండల స్థాయి నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎన్నికలకు ముందు వెళ్లిన ఎమ్మెల్యే… ఎక్కువగా వైసీపీ నేతలకు, ఆ పార్టీ మాజీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారునే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. నియోజకవర్గంలో తక్కువగా తిరిగే సదరు ఎమ్మెల్యే… తన ఇంటి వద్ద ఎక్కువగా వైసీపీ నేతలనే కలుస్తున్నారు అనే ఆరోపణలు నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు నుంచి వస్తున్నాయి. ఆయన ఇలాఖాలో టిడిపి నాయకులకి, కార్యకర్తలకి ఎలాంటి విలువ లేదనేది బహిరంగ రహస్యమే అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వివేకా కేసులో కీలక అడుగు.. ఇప్పుడైనా అరెస్ట్ అవుతారా…?
ఈ నియోజకవర్గంలో ఉన్న టిడిపి మాజీ మంత్రి.. ఫోటో ఎవరైనా పెట్టిన, ఆయన పేరుతో ఎవరైనా బ్యానర్లు ఏర్పాటు చేసిన ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సదరు ఎమ్మెల్యే వెనకాడటం లేదు. ఎవరైనా బ్యానర్లో మాజీ మంత్రి ఫోటో పెడితే వాళ్లకు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లి వాళ్లను బెదిరిస్తున్నారు అనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ఇక తనతో ఎవరైనా స్థానిక యువ నాయకులు తిరగకపోతే… వారిపై గంజాయి కేసులు పెట్టించేందుకు కూడా సదరు ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు అనే అభిప్రాయాలు కూడా నియోజకవర్గంలో వినపడుతున్నాయి.
Also Read: మంగళగిరి ఎయిమ్స్ దాహం తీర్చిన చంద్రబాబు
మైనింగ్ అలాగే ఇతర అక్రమాల విషయంలో గతంలో వ్యవహరించిన పద్ధతినే సదరు ఎమ్మెల్యే ఫాలో అవుతున్నారు అనే ఆగ్రహం నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలంగా కనబడుతున్నా… ఇలా వలస నేతల కారణంగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఐదేళ్లపాటు తాము ఎన్నో కష్టాలు పడ్డామని, కేసులు పెట్టించుకున్నామని… అయినా సరే వైసీపీ నుంచి వచ్చిన నేతలకి… ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తోందని ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొరపాట్లు అధిష్టానం సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవేమో.