ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు తర్వాత సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరితో కలిసి నేరుగా చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో కలిశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కూడా తాను చంద్రబాబు అభిమాని అన్నారు. చంద్రబాబుపై కేవలం పార్టీ లైన్ మేరకే విమర్శలు చేసినట్లు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని… తనకు రెండుసార్లు మండలిలో అవకాశం చంద్రబాబు వల్లే వచ్చిందన్నారు సోము వీర్రాజు.
Also Read: లొంగిపోయిన బోరుగడ్డ.. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఇదే
అయితే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. గతంలో బీజేపీ ఏపీ చీఫ్‌గా వ్యవహరించిన సమయంలో నాటి వైసీపీ ప్రభుత్వంపై కంటే కూడా చంద్రబాబు పైనే సోము వీర్రాజు ఎక్కువగా విమర్శలు చేశారు. ప్రతి చిన్న విషయం కూడా చంద్రబాబు తప్పు చేయడం వల్లే జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఒకదశలో వైసీపీ ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని… తప్పంతా చంద్రబాబుదే అంటూ వ్యాఖ్యానించారు కూడా. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని… కేవలం 9 వేల ఎకరాల్లోనే బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని కూడా సోము వీర్రాజు హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ కోవర్టుగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: తిట్టిన వారికే పదవులు.. ఇదెక్కడి లాజిక్..!
ఇక సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ దూరంగా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో చంద్రబాబుపైన, టీడీపీ ప్రభుత్వ పాలన పైన సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవానికి 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ భాగస్వామ్యులే. అయినా సరే.. నాటి ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నారు. అయినా సరే… తప్పంతా చంద్రబాబు మాత్రమే చేసినట్లుగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా సరే.. కుల, మతాలు, వర్గ విభేదాలకు చంద్రబాబు మాత్రమే కారణం అని సోము వీర్రాజు పలుమార్లు ఆరోపించారు.
Also Read: పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?
ఇప్పుడు ఇవే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చి మండలికి పంపాలా అంటూ తెలుగు తమ్ముళ్లు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇన్ని విమర్శలు చేశారు కాబట్టే సోము వీర్రాజు నామినేషన్ ప్రక్రియకు లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన అభ్యర్థి నాగబాబు నామినేషన్ దాఖలు సమయంలో పక్కనే ఉన్న లోకేష్… బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ దాఖలుకు మాత్రం దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కూటమిలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ… సోము వీర్రాజుపై లోకేష్‌కు ఇంకా కోపం పోలేదంటున్నారు కొందరు నేతలు.