2019లో టిడిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. నాయకులు భయపడినా సరే.. కార్యకర్తలు మాత్రం ఎక్కడా భయపడలేదు. వాళ్లపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా వేధించిన సరే కార్యకర్తలు బయటకు వచ్చి పోరాటాలు చేశారు. కేసులు పెట్టే కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని ముందుకు నడిపించారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కార్యకర్తల్లో ఆ సంతోషం గానీ, ఆ ఉత్సాహం గానీ కనపడటం లేదు. వైసీపీ హయాంలో ధైర్యంగా పోరాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మౌనంగా ఉండిపోవడాన్ని గమనించిన కొందరు రాజకీయ పరిశీలకులు టిడిపి అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు.
Also Read: రోజురోజుకూ పెరుగుతున్న శత్రువులు..!
2021 కరోనా తర్వాత కార్యకర్తల్లోనే నారా లోకేష్ ఎక్కువగా ఉన్నారు. 2019కి ముందు కూడా ఆయన కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పార్టీలో కనపడకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి తన సత్తా ఏంటో చూపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కార్యకర్తల్లోకి రాకపోవడం, లేదంటే ప్రజల్లోకి రాకపోవడానికి ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి హోదాలో సమర్థవంతంగా పనిచేస్తున్న లోకేష్, నాయకుడిగా మాత్రం కార్యకర్తలను కలవడం లేదనే అసహనం పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగా కనబడుతోంది.
Also Read: విలువలు, విశ్వసనీయత.. ట్వీట్ వార్..!
చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అలాంటి లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాలతోనే బిజీగా ఉండటం పట్ల కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కనీసం నెలలో ఒకటి, రెండు సార్లు అయినా జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. జిల్లాల వారీగా లేదంటే నియోజకవర్గాల వారీగా తరచుగా సమావేశాలు నిర్వహిస్తే మంచిదని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులు పెట్టించుకున్న వాళ్లకు నియోజకవర్గాల్లో విలువ లేదని.. ఇక వైసీపీ నుంచి కొత్తగా పార్టీ మారిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా లభిస్తోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ర్యాంకులతో కూటమికి కొత్త తలనొప్పులు..!
ఇక నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వం కూడా వైసిపి మాజీ కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కార్యకర్తలు కాడి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు భయపడని టిడిపి కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్తగా చలామణి అవుతున్న నాయకులకు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికి లోకేష్ ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టిడిపి అధిష్టానం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు బలంగా కోరుతున్నారు.