తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది కేవలం కమ్మ వారి పార్టీ అనే మాట. నిజమే.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతా రెడ్డి సామాజిక వర్గానిదే పెత్తనం. కోట్ల, నేదురుమిల్లి, వైఎస్, కాసు, కుటుంబాల చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ కొనసాగింది. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ అంటే.. మాదే అని బల్లగుద్ది మరీ చెప్పేవారు. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత అన్ని కులాల వారికి పెత్తనం ఇచ్చారు. ముఖ్యంగా బీసీ కులాలకు గుర్తింపు వచ్చింది. దీని కారణంగా నెమ్మదిగా కాంగ్రెస్ పట్టు సడలిపోయింది. దీంతో రెడ్డి పెత్తనం బాగా తగ్గిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కులాల వారికి ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విషయం జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు.. టీడీపీపై కులం ముద్ర వేశారు. చివరికి చంద్రబాబు తలపెట్టిన అమరావతిపై కూడా కులం ముద్ర వేసి కమ్మరావతి అనే అపోహ సృషించారు.
Also Read : లక్షయ్య నాయుడుకి చేసిన న్యాయమే భవిష్యత్తులో అందరికీ చేస్తారా
ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ వ్యవహరం పెద్ద దుమారం రేపుతోంది. అవినీతి అధికారి అనే ముద్ర పడిన డీఆర్వో భవానీ శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వాస్తవానికి భవానీ శంకర్‌పై వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారని.. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారనేది అప్పట్లో టీడీపీ నేతల ఆరోపణ. అయినా సరే.. కూటమి ప్రభుత్వం మాత్రం.. భవానీ శంకర్‌ను కీలకమైన డీఆర్వో పోస్టింగ్ ఇచ్చింది. ఇక శ్రీలేఖపై వేటు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనల ప్రకారం నడుచుకున్నందుకు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమెపై నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యర్రగొండపాలెం నియోజకవర్గం ఆర్వోగా ఉన్న శ్రీలేఖను ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బెదిరించారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. చివరికి శ్రీలేఖకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో.. చంద్రబాబు స్వయంగా హామీ కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర నెలల వరకు కూడా శ్రీలేఖకు ఎలాంటి పోస్టింగ్ రాలేదు.
Also Read : దానం చుట్టూ మరో వివాదం..!
ఇక తాజాగా విశాఖలో భూముల అక్రమ రిజిస్టేషన్‌ను శ్రీలేఖ అడ్డుకున్నారనే ఏకైక కారణంతో ఆమెపై చర్యలు తీసుకున్నారనే మాట బాగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి సుమారు 350 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఆ భూమి పట్టాలు పొందేందుకు ప్రస్తుత సీఎంఓలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో లావాదేవీలు నిర్వహించారనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. అందుకోసమే అవినీతి ముద్ర ఉన్న భవానీ శంకర్‌ను డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారాన్ని శ్రీలేఖ అడ్డుకోవడంతో.. ఆమెపై ఇలా కక్ష తీర్చుకున్నారనేది బహిరంగ రహస్యం. సాధారణంగా ఎవరైనా ఎవరి మీదైనా ఫిర్యాదు చేస్తే.. ముందు ఆ ఫిర్యాదులో నిజమెంతా అని విచారిస్తారు. అది నిజమని తేలితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై వేటు వేస్తారు. అవి తప్పుడు ఆరోపణలు అని తేలితే.. అలా తప్పుడు ఆరోపణలు చేసిన అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగే వ్యవహారం. కానీ ప్రస్తుతం భవానీ శంకర్‌పై శ్రీలేఖ అవినీతి ఆరోపణలు చేస్తే.. ఎలాంటి విచారణ జరిపించకుండానే.. ఇద్దరి పైన చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇద్దరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : కొలికపూడి వర్సెస్ కేసినేని.. అధిష్టానం సీరియస్.. మంగళగిరిలోనే పంచాయితీ..!
ఆర్డీవో శ్రీలేఖపై చర్యలు తీసుకోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు శ్రీలేఖ చేసిన తప్పేంటి.. శ్రీలేఖను ఎందుకు జీఏడీలో రిపోర్టు చేయమన్నారు.. ఇందుకు ఏకైక కారణం.. సీఎంవోలో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర అని తెలుస్తోంది. సొంత సామాజిక వర్గం అయినప్పటికీ శ్రీలేఖపై చర్యలు తీసుకున్నామని గొప్పలు చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసిందనే మాట కూడా వినిపిస్తోంది. గతంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరించిన సమయంలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సరే.. ఆయనపై జగన్ సర్కార్ ఈగ కూడా వాలనివ్వలేదు. దీంతో అప్పట్లో రెడ్డి సర్కార్ అనే ఆరోపణలు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధం. శ్రీలేఖపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆమె డీఆర్వో భవానీ శంకర్ పైన ఆరోపణలు చేశారు. అయినా సరే శ్రీలేఖపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, అధికారులకు ఏ మాత్రం రక్షణ లేదనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. మరి ఈ చెడ్డపేరును చంద్రబాబు, లోకేష్ ఎలా చెరిపేస్తారో చూడాలి.