అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాదిన్నర కావోస్తోంది. ఓ వైపు అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వంపై సానుకూలంగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరిద్దరు నేతల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వీరి తీరు వల్ల ప్రభుత్వానికి కూడా కావాల్సినంత చెడ్డపేరు వస్తోంది. ఇలాంటి వారిని దూరం పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీకి జనసేన దెబ్బ..?
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది నేతల తీరు వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారిలో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు కోస్తా ప్రాంతానికి చెందిన ఓ నేత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వరుసగా గెలిచిన ఆ నేతలు.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న కేసులు, వేధింపుల కారణంగా సానుభూతితో మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురిని కలుపుకుంటూ పోవాల్సిన నేతలు.. ఇప్పుడు గ్రూప్ రాజకీయాలతో పార్టీని ముక్కలు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు కూడా.
ఒకరు ఆధిపత్యం కోసం కుట్రలు చేస్తున్నారని.. మరొకరు ఆదాయమే పరమావధిగా ఉన్నారని.. ఇంకొకరు మీద అయితే.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో జిల్లాలో ఆధిపత్యం కోసం సీనియర్లను పక్కన పెట్టిన ఓ నేత.. పూర్తిగా కొత్తవారికే టికెట్లు ఇప్పించుకున్నారు. వారికి టికెట్ ఇప్పించేందుకు పెద్ద మొత్తం తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. సీనియర్లపై వరుస ఆరోపణలతో వారిని పూర్తిగా బద్నాం చేస్తున్నారనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. పార్టీ లేదు.. బొక్కా లేదు.. అంటూ మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు జిల్లాలో పార్టీని ముక్కలు చేస్తున్నారనేది ఆ జిల్లా టీడీపీ నేతల మాట.
Also Read : ఉక్రెయిన్ పై మోడీ యుద్ధం.. అమెరికా సంచలన కామెంట్స్
ఇక మరో నేత అయితే.. ఇదే చివరి అవకాశం.. మరోసారి తనకు అవకాశం రాదేమో అన్నట్లుగా అవినీతికి పాల్పడుతున్నారనేది పార్టీ నేతల మాట. ఆ మంత్రి శాఖ పరిధిలో కావాల్సినన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి కూడా. కులం కార్డు వినియోగిస్తున్న సదరు మంత్రిగారు.. చంద్రబాబు, లోకేష్ తనకు అత్యంత ఆప్తులంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనేది పార్టీ నేతల మాట. ఇటీవల కిలాడీ అరుణ పెరోల్ వివాదంలో కూడా ఈ మంత్రిగారి పేరు బాగానే వినిపించింది. పెరోల్ కోసం ఏకంగా రూ.2 కోట్లు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఆ పెరోల్ రద్దు చేసినప్పటికీ.. డబ్బులు మాత్రం తిరిగి ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట.
ఇక కోస్తా ప్రాంతానికి చెందిన మరో బీసీ మంత్రిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా 6 నెలల క్రితం హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు చేస్తున్న ఏపీ మంత్రి అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో తాటికాయంత అక్షరాలతో రాసిన వార్త ఈ మంత్రిగారి గురించే అనేది వాస్తవం. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసింది సదరు మంత్రిగారి సైన్యం. పేరుకే ఎమ్మెల్యే అయినప్పటికీ.. పెత్తనం అంతా అన్న చేతికి అప్పగించి.. ఆయన మాత్రం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఇక వారం రోజుల క్రితం తిరుపతిలో మంత్రి సరసాలు.. అంటూ సొంత పార్టీ అధికార ప్రతినిధి స్వయంగా వ్యాఖ్యలు చేసింది కూడా ఈ మంత్రి గారి గురించే అనేది ఇప్పుడు పార్టీలో ఎవరిని అడిగినా సరే.. అవుననే సమాధానమే వస్తుంది.
Also Read : సెలూన్ షాపుల్లో జాగ్రత్త.. వైద్య నిపుణుల వార్నింగ్..!
ఓ వైపు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తుంటే.. ఈ అమాత్యులు మాత్రం.. మాకెందుకు అవన్నీ.. మా పనులు జరుగుతున్నాయా లేదా అనేలా వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే.. తమపై అధినేత ఎలాంటి చర్యలు తీసుకోరని.. ఆయనకు అపారమైన నమ్మకం ఉందంటున్నారు ఈ నేతలు. తొలగిస్తే.. కులం కార్డు వాడేస్తామని సన్నిహితులతో చెబుతున్నారట కూడా. అయినా.. మేము మాత్రమేనా.. మిగిలిన వారు కాదా.. అని ఎదురు కూడా ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి ఇలాంటి అమాత్యుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.