జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ ఈ మధ్య కాస్త పలు స్కాంలపై దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్షాలు, బిజెపియేతర ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఈడీపై సుప్రీం కోర్ట్ సంచలన కామెంట్స్ చేసింది. రాజ్యాంగ సమాఖ్య నిర్మాణాన్ని ఈడీ ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, తమిళనాడు ప్రభుత్వ మద్యం సంస్థ టాస్మాక్ (తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు, దాడులను గురువారం అడ్డుకుంది.
Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు
టాస్మాక్ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 నిబంధనల ప్రకారం ఈడీ దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కేంద్ర సంస్థ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈడీ అన్ని లిమిట్స్ దాటేస్తోంది అంటూ మండిపడ్డారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి, ఈడీ చర్యలు ఏ మాత్రం సమర్ధించేవి కాదని, బహుశా రాజ్యాంగ విరుద్ధమైనవి అని కూడా వ్యాఖ్యానించారు. మంగళవారం (మే 20) మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read : మహానాడులో చర్చించే అంశాలేమిటో తెలుసా..?
ఈడీ దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతిస్తూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపణలు చేస్తూ దర్యాప్తుకు దిగింది. మద్యం ఆర్డర్ ల కోసం డిస్టిలరీలు భారీగా లంచాలు ఇచ్చాయని వ్యాఖ్యానించింది. 2014–2021 మధ్య కాలంలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ద్వారా ఇప్పటికే 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తమిళనాడు సుప్రీంకోర్టుకు తెలిపింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తమిళనాడు సర్కార్ ఆరోపిస్తోంది.