ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అలాగే జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పులపై కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పు అంశంపై కూడా ప్రజల నుంచి ప్రభుత్వానికి భారీగానే డిమాండ్లు వస్తున్నాయి. వీటిల్లో ప్రధానమైనది మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
Also read : భారీ బడ్జెట్ కో దండం.. హీరోల పరువు పోతుందా..?
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నప్పటి నుంచే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే గత ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా విభజించడంతో.. ఈ ప్రాంత వాసుల కల అలాగే మిగిలిపోయింది. ఇక ఎన్నికల సమయంలో మార్కాపురం పర్యటనలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతామన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.
అయితే ఇక్కడే మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే శ్రీశైలం. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీశైలం. జ్యోతిర్లింగం, శక్తి పీఠం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఉండటంతో పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి. ఈ శ్రీశైలం, సున్నిపెంట ఊర్లను కూడా మార్కాపుం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో విలీనం చేయాలనేది మార్కాపురం వాసుల డిమాండ్. వాస్తవానికి శ్రీశైలం 12 కి.మీ. దూరంలోని శిఖరం వరకు మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉంది. అలాగే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో శ్రీశైలం చేరింది. అయితే శ్రీశైలం నుంచి నంద్యాల చేరుకోవాలంటే.. కనీసం 5 గంటలు పైగా ప్రయాణం చేయాల్సిందే. ఇదే సమయంలో మార్కాపురం నుంచి శ్రీశైలం కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి శ్రీశైలం కొత్త జిల్లాలో కలపడమే సమంజసం అనే మాట వినిపిస్తోంది.
Also read : బిజెపికి కోమటిరెడ్డి ఆఫర్.. అలెర్ట్ అయిన కాంగ్రెస్..?
ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా తెరపైకి వస్తోంది. వాస్తవానికి 2009 వరకు శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగం. అయితే 2009లో ఆత్మకూరు రద్దు చేసి శ్రీశైలం కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లాలన్నా కూడా 2 ఘాట్ రోడ్‌ల మీదుగా సుమారు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. శ్రీశైలం, సున్నిపెంట ఊర్లు మాత్రమే మార్కాపురంలో చేరిస్తే.. మిగిలిన నియోజకవర్గం పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి.