గౌతు శిరీష… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్న పేరు. రాజకీయాల్లో శివంగి అనే పేరు తెచ్చుకున్న నేత. తాత సర్దార్ గౌతు లచ్చన్న, తండ్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ రాజకీయ వారసురాలిగా పాలిటిక్స్‌లో కాలు పెట్టారు. కోట్ల ఆస్తి, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ… ఇప్పటికీ సాదాసీదా దుస్తులు, అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు. సీనియర్ నేతలతో సైతం ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం చేసిన గౌతు శిరీష పై రెండు రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శిరీష హాజరయ్యారు.
Also Read: ఫైబర్ నెట్ లో దారుణాలు.. జీవీ రెడ్డి సంచలన కామెంట్స్
అయితే ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి జోరి రమేష్‌తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. దీంతో శిరీషపై విమర్శలు వెల్లువెత్తడంతో.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే శిరీషపై పార్టీ అగ్రనేతలు గుర్రుగా ఉన్నారని… క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారనే పుకార్లు ప్రస్తుతం షికారు చేస్తున్నాయి. ఇప్పటికే నారా లోకేష్‌ను స్వయంగా కలిసి వివరణ ఇచ్చారు శిరీష. అయితే గౌతు కుటుంబానికి సిక్కోలు నేతలు అండగా నిలిచారు. శిరీషపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. తాత విగ్రహావిష్కరణకు హాజరైతే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రశ్నించాల్సిన పార్టీ… శిరీషను ఎలా తప్పుబడతారని నిలదీస్తున్నారు.
Also Read : రేవంత్ ను రెచ్చగొట్టి బలయ్యారా…? సినిమా పెద్దలు తగ్గాల్సిందే…!
మంత్రి పదవి రాకున్నా కూడా.. పార్టీకి విధేయుడిగానే శివాజీ పని చేశారని.. గౌతు కుటుంబానికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు రాజకీయాలు చేసినప్పటికీ… పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజుపై ఏకంగా 40 వేల ఓట్ల తేడాతో గెలిచిన విషయం మర్చిపోయారా అని గౌతు అభిమానులు నిలదీస్తున్నారు. ఇదే సమయంలో గతంలో వైసీపీ నేతలను టీడీపీ నేతలెవరరూ కలవలేదా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరులతో కింజరాపు అల్లుడు ఆదిరెడ్డి వాసు వ్యాపారాలు చేస్తున్న విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి… ఏలూరుకు చెందిన ఓ మహిళా నేత వైసీపీ సోషల్ మీడియా నేతతో చేసిన చాటింగ్ వ్యవహారం మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు.
Also Read: గనుల వెంకటరెడ్డిని వెంటాడుతున్నారా..? మళ్ళీ దొరికాడు..!
అలాంటి నేతలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా.. కనీసం వివరణ కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా శిరీష భర్త వెంకన్న చౌదరిపై పలాసలో వీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత కుటుంబం తప్పుడు ఆరోపణలు చేయించి.. 2019లో శిరీష ఓటమికి పరోక్షంగా కారణమైందని… ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న అని.. అలాంటి పేరును చెరిపేయాలని ఓ కుటుంబం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని కూడా విమర్శలు చేస్తున్నారు. గౌతు లచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వాహకులపై ముందుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గౌతు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని భావిస్తున్న సీనియర్ నేతపై కూడా క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబును కోరుతున్నారు.