ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తనకు ప్రతిపక్ష హోదా కావాలనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన డిమాండ్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు వచ్చేది లేదంటున్నారు. పైగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎందుకు అంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. ప్రభుత్వాన్ని నిలదీయాలి.. అంటున్నారు. అంతే తప్ప.. సభకు మాత్రం రాను అంటున్నారు.
Also Read : మీ మాటే ఫైనల్.. మీరే నా దేవుళ్లు..!
వై నాట్ 175 అన్నారు.. అసలు తనకు ప్రతిపక్షమే అవసరం లేదన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ మాత్రమే ఉండాలన్నారు. చివరికి 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు జగన్. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పటి వరకు సభకు కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. మొదటి సారి కూడా సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసేందుకు.. రెండోసారి మాత్రం బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగిస్తున్న రోజున. అంతే తప్ప మళ్లీ సభకు రాలేదు. తొలిసారి కూడా విజ్ఞప్తి మేరకు సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత జగన్ ప్రమాణస్వీకారం చేసేందుకు టీడీపీ అంగీకారం తెలిపింది.
అయితే దానిని సాకుగా చూపించి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా తేల్చేశారు. సభలో కనీసం 10 శాతం సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని.. 175 స్థానాలున్న అసెంబ్లీలో వైసీపీకి కేవలం 11 మాత్రమే వచ్చాయని.. కాబట్టి ప్రతిపక్ష హోదా రాదన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ 18 స్థానాల్లో గెలవాల్సి ఉందన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అవేవీ పట్టించుకోవటం లేదు. జగన్ అంటే భయమని.. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదంటున్నారు.
Also Read : మరో తేదీ ప్రకటించిన జగన్..!
జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన పిటిషన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దేవాలయంలో నేను పూజారిని మాత్రమే.. దేవుడే జగన్‌కు వరం ఇవ్వలేదు.. నేనేం చేయాలి.. అంటూ వ్యాఖ్యానించారు. నేను చట్ట ప్రకారమే నడుచుకుంటా.. నాపై ఏ కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదు అన్నారు. జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్టాడాలని సూచించారు. అదే సమయంలో గతంలో సర్దార్ గౌతు లచ్చన్న వ్యవహరించిన తీరును గుర్తు చేశారు స్పీకర్ అయ్యన్న.
1978లో జనపార్టీకి 60 స్థానాలు వచ్చాయని.. అందుకని ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించారన్నారు. అయితే కొందరు జనతా పార్టీకి చెందిన సభ్యులు పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో తగ్గిపోయిందన్నారు. దీంతో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో.. గౌతు లచ్చన్న స్వయంగా ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆ రోజు ఆయనను రాజీనామా చేయాలని ఎవరూ డిమాండ్ చేయలేదని.. నైతిక విలువలకు కట్టుబడి ఆయనే రాజీనామా చేశారన్నారు అయ్యన్న. అంతేకానీ ఇదేంటి.. ఇలాంటి డిమాండ్ గురించి ఎక్కడా వినలేదని స్పీకర్ ఎద్దేవా చేశారు.