వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతం మర్చిపోయారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ ప్రశ్నకు నిజమే అనే సమాధానం వస్తోంది. నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరు వినగానే.. ఆయనకు ఏమీ గుర్తు ఉండవు కదా.. అంటారు. ఆయన ఏం మాట్లాడాలన్నా సరే.. పేపర్ మీద రాసి ఇవ్వాల్సిందే. ఇంకా చెప్పాలంటే స్పూన్ ఫీడింగ్ మాదిరిగా ప్రతి మాట పేపర్ మీద ఉండాల్సిందే అనేది ఆయన సన్నిహితుల మాట. అందుకే ప్రతి ప్రెస్ మీట్లో కూడా కేవలం రాసుకొచ్చిన.. వాస్తవంగా చెప్పాలంటే.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే ఆయన చదువుతారనేది బహిరంగ రహస్యం కూడా. అందుకే ప్రెస్ మీట్ అని చెప్పినా కూడా.. కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. అలా వచ్చిన వాళ్లు ఎదురు ప్రశ్నించకూడదు. ఆయన చెప్పింది రాసుకుని వెళ్లిపోవాల్సిందే.
వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో ఇచ్చిన హామీలను మర్చిపోయారు. అమ్మఒడి కింద ప్రతి విద్యార్థికి అని పాదయాత్రలో చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి మాత్రమే ఇచ్చారు. ఇక కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పిన జగన్.. కేవలం తన కులానికి, తన ప్రాంతానికి చెందిన అధికారులకే కీలక పోస్టులిచ్చారు. తన పార్టీ నేతలకో రూల్.. ప్రతిపక్ష నేతలకో రూల్ అన్నట్లుగా పాలన కొనసాగించారు. అధికారంలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్న ఉద్యోగులతో ఒక మాదిరిగా.. ఎదురు ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అరెస్టులు చేయించారు కూడా. ఇక రాజధాని విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అమరావతిలోనే నా ఇల్లు అని గొప్పగా చెప్పిన జగన్.. ఆ తర్వాత 3 రాజధానులంటూ కొత్త, వింత పాట పాడి.. విశాఖ రుషికొండపై ప్రభుత్వ సొమ్ముతో ప్యాలెస్ నిర్మించారు.
Also Read : కల్తీ నెయ్యి కేసు.. అసలు నిందితులు సేఫ్..!
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు మతిమరుపు వచ్చిందా.. అనే ప్రశ్నకు కారణమయ్యాయి. ఏలూరు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను జగన్ వినలేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్పేసి వెళ్లిపోయాడు. నిజానికి ఏలూరు, భీమవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరులో ఆళ్ల నాని టీడీపీలో చేరగా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేసి సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాలు చుక్కాని లేని నావ మాదిరిగా మారిపోయాయి. ఆ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు సరైన నేతలను ఎంపిక చేయలేదనేది జిల్లా నేతల మాట. అయినా సరే.. జగన్ ఆ విషయం మర్చిపోయారు.
భీమవరం రివ్యూ మీటింగ్‌లో ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో వైరల్ వ్యవహారం ప్రస్తావించారు. మహిళలను బెదిరించారు.. జంగిల్ రాజ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గంట సేపు.. ఏం చేస్తారు.. అన్నీ చేస్తారా..?” అంటూ సంజన అనే మహిళతో మాజీ మంత్రి అంబటి ఫోన్ ఆడియో తెర పైకి తీసుకువచ్చారు. అలాగే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్లో చేసిన వికృత చేష్ఠల గురించి కూడా గుర్తు చేస్తున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అరగంట వ్యవహారం మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు. ఇక జంగిల్ రాజ్యం అంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులను ఆయన ఇంట్లోనే రెండు రోజుల పాటు కిడ్నాప్ చేసి.. డబ్బులు వసూలు చేసిన విషయాన్ని జగన్‌కు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్..!
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఐదేళ్లలో లెక్కలేనన్ని ఘటనలు ఉన్నాయని.. అవన్ని జగన్ మర్చిపోయారా అని నిలదీస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. జగన్‌కు మతిమరుపు వచ్చిందని.. అందుకే రిపబ్లిక్ డే రోజు కూడా మర్చిపోయారని.. అందుకే జెండా వందనం కూడా చేయలేదని సెటైర్లు వేస్తున్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు.. చివరికి వైసీపీ నేతలనే ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

