ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు పూర్తైనప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులను ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత తొలి జాబితా విడుదల చేసినప్పటికీ దానిపై చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. కేవలం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్ని కీలకమైనవి ఉన్నప్పటికీ… మరికొన్ని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలకు బోర్డులను నియమించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే దేవస్థానాలు నడుస్తున్నాయి. టీటీడీ, దుర్గ గుడి, శ్రీశైలం, పైడితల్లి అమ్మవారు వంటి ప్రధాన ఆలయాల్లో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఇప్పటికే తిరుమల, అన్నవరం వంటి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో కల్తీ వస్తువులు ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరలో వీటికి పాలక మండలిని నియమించాల్సి ఉంది.
Also Read : హడావిడిగా లోకేష్ ఢిల్లీ ఎందుకు.. వైసీపీలో టెన్షన్..!
అలాగే ఏపీ మహిళా కమిషన్ సహా కీలకమైన కార్పొరేషన్లను భర్తీ చేయాల్సి ఉంది. తొలి విడతలో పీతల సుజాత, కొనకళ్ల నారాయణ, దీపక్ రెడ్డి, రవి నాయుడు వంటి వారికి అవకాశం కల్పించారు. అయితే పార్టీ కోసం టికెట్లు త్యాగం చేసిన దేవినేని ఉమ, వర్మ, జవహర్‌తో పాటు పార్టీ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డి, జ్యోత్స్న, అనుబంధ సంఘాలకు చెందిన ఆచంట సునీత, శ్రీనివాసరెడ్డి, కోటేశ్వర్రావు వంటి నేతలు కూడా ఇప్పుడు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి తొలి జాబితాలోనే వీరికి పదవులు వస్తాయని అనుకున్నప్పటికీ… లిస్టులో పేరు లేకపోవడంతో కాస్త తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సెకండ్ లిస్టు రిలీజ్ చేసేందుకు చంద్రబాబు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసమ కష్టపడిన వారికి, త్యాగం చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని రెండు రోజుల క్రితం జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇదే సమయంలో తొలి విడతలో జనసేన, బీజేపీ నేతలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి మాత్రం ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని… అలాగే జనసేన, బీజేపీ నేతలకు కూడా పదవులివ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 23న జాబితా విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ నేతల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.