వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన లీడర్ ఎవరూ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా సజ్జలను సకల శాఖా మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు. జగన్ సర్కార్ లో ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిలో ఉన్న సజ్జల.. ఏ శాఖ గురించి అయినా సరే అటు మీడియాలో కానీ, ప్రతిపక్షాలైనా సరే విమర్శలు, ఆరోపణలు చేస్తే చాలు… సంబంధిత మంత్రికి బదులుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే వివరణ ఇచ్చారు. చివరికి ఇద్దరు మహిళా మీడియా ప్రతినిధులు తగువులాట సమయంలో కూడా.. పది ఎస్ఆర్కే దగ్గరకు… నీ సంగతి ఆయనే తేలుస్తారు అనే మాటలు వచ్చాయంటే ఆయన ఎంత పవర్ ఫుల్ గా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీఎం హోదాలో ఏం మాట్లాడాలో, ఎవరిని కలవాలనేది పూర్తిగా సజ్జల డైరెక్షన్ లోనే జరిగిందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల ముందు పవర్ ఫుల్ ల్ స్టార్ గా చక్రం తిప్పిన సజ్జల… ఎన్నికల తర్వాత సొంత పార్టీ నేతలతోనే తిట్లు తినే పరిస్థితి తెచ్చుకున్నారు. వైసిపి ఘోర పరాజయానికి సజ్జల తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, సోషల్ మీడియాలో సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి మహిళలను కించపరిచేలా చేసిన పోస్టింగ్ లు, ఫేక్ ప్రచారాలే కారణమని వైసిపి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Read Also : ఎమ్మెల్యేలే టీడీపీ కొంప ముంచుతున్నారా…?
వైసిపి ఓటమి తర్వాత దాదాపు మూడు నెలలపైగా సజ్జల అజ్ఞాతవాసంలోనే గడిపారు. సొంత నేతల విమర్శలు ఎక్కువ కావడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అయితే సజ్జల పెట్టిన ప్రెస్ మీట్ వైసిపికి మైలేజ్ తీసుకుని రాకపోగా మూలిగే నక్క మీద తాటికాయపడినట్లుగా మరింత డ్యామేజ్ చేసింది. తిరుమల లడ్డు ప్రసాదం కల్తి ఆరోపణలపై కెమెరా ముందు వివరాలు చూపిస్తున్న సమయంలో సజ్జల వెనకాల ఉన్న శిలువ తరహా గుర్తులు తొలగించడం ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమైంది. తామంతా వెంకటేశ్వర స్వామివారి భక్తులంటూ చెప్పుకునే ప్రయత్నం చేసిన సజ్జల వెనకాలే ఉన్న శిలువ గుర్తులను సైలెంట్ గా తీసెయ్యడం పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక సొంత పార్టీ నేతలు సైతం సజ్జలను తొలగించాలంటే ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి భవిష్యత్తు ఉండాలంటే సజ్జల లాంటి లీడర్లను పక్కన పెట్టాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.