సజ్జల రామకృష్ణారెడ్డి… వైసీపీలో జగన్ ఎంత ఫేమస్సో… సజ్జల కూడా అంతే ఫేమస్. ఎస్ఆర్‌కే అనే పేరుతో ఒకదశలో వైసీపీలో నంబర్ టూ అంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. పార్టీలో సీనియర్లను కాదని సజ్జల చెబితే ఫైనల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిలో ఐదేళ్లు కొనసాగిన సజ్జల.. అన్ని శాఖలపై పెత్తనం చేశారు. దీంతో సజ్జలకు సకల శాఖా మంత్రి అనే పేరు కూడా వచ్చేసింది. ఏ శాఖపైన అయినా సరే ఆరోపణలు వస్తే… వెంటనే సంబంధిత శాఖ మంత్రికి బదులుగా… ఈయనే ప్రెస్‌మీట్ పెట్టి… ఆరోపణలు ఖండిస్తారు. అలాగే ఏ సమస్య అయినా సరే… ముందుగా సజ్జలకే వివరించాలి. ఆయనే పరిష్కరించాలి. అది ఉద్యోగులదైనా, నేతల మధ్య విభేదాలైనా, పార్టీలో టికెట్ల కేటాయింపు అయినా సరే… అంతా సజ్జల కంట్రోల్‌లోనే నడవాలి.
Also Read : ఆ రూల్ మార్చండి.. టీటీడీకి వినతులు..!
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం సజ్జల అని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసినప్పటికీ… మరోసారి పార్టీ కో ఆర్డినేటర్ పదవిని సజ్జలకే ఇచ్చారు జగన్. ఏపీలో వైసీపీ హయాంలో అధికారం అడ్డుపెట్టుని నోరు పారేసుకున్న నేతల అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే బోరుగడ్డ అనిల్, నందిగాం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళీ వంటి నేతలు అరెస్టు అయ్యారు. నోటి దూలతో విరుచుకుపడిన పోసాని అరెస్టు తర్వాత అందరి దృష్టి ఇప్పుడు నెక్ట్స్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై రాయడానికి, వినడానికి కూడా వీలు కాని పదాలతో రెచ్చిపోయారు కొందరు వైసీపీ నేతలు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పాపం పండుతోంది.
Also Read : కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?
పోసానిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు… దాదాపు 5 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో తన వ్యాఖ్యాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని… ఆయన చెబితేనే ఇలా చేశామంటూ అసలు విషయం బయటపెట్టారు పోసాని. గతంలో కూడా ఇదే తరహాలో సజ్జలపైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇటు ముంబై మోడల్ జత్వాని కేసులో కూడా సజ్జలపై ఆరోపణలున్నాయి. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ పిటిషన్‌లో వేడుకున్నారు. జగన్ ఆదేశాలివ్వడం… వాటిని సజ్జల పాటించడం అనేది వైసీపీ నేతలతో పాటు గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన ప్రతి ఒక్కరికీ తెలిసిందే. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని వదలకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Also Read : షూటింగ్ లో రెబల్.. కానీ రిలీజ్ ఎప్పుడు…?
అయితే సజ్జలతో పాటు పెద్దిరెడ్డి వంటి పెద్దల జోలికి మాత్రం కూటమి సర్కార్ పోవటం లేదు. దీనికి కూడా ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టులపై ఒకటి రెండు రోజులు మాత్రం అక్రమం అంటూ గగ్గొలు పెడుతున్న వైసీపీ నేతలు… ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. సామాన్యులైతే అయ్యో పాపం అని కూడా అనటం లేదు. బోరుగడ్డతో పాటు, పోసాని కేసులో కీలక పాత్రధారి సజ్జల అనేది ఇప్పటికే క్లియర్ అయిపోయింది. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నా చితకా కేసుల్లో అయితే వెంటనే బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అదే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనే సామెత మాదిరి… కొడితే సజ్జల మైండ్ బ్లాంక్ అయ్యేలా కూటమి ప్లాన్ చేస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి వైసీపీ నంబర్ టూ, కో ఆర్డినేటర్… రింగ్ లీడర్ ఎప్పుడు అనే ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.