గత కొన్నాళ్ళుగా ఫాం కోల్పోయిన విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో తాండవం ఆడారు. పూనకం వచ్చినట్టు క్రీజ్ లో పాతుకుపోయి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. మరి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి ఏంటీ…? ఫాంలోకి వస్తాడా రాడా…? భారత క్రికెట్ అభిమానులను కంగారు పెడుతున్న కలవరపెడుతున్న అంశం ఇదే. కెఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నాడు రోహిత్ శర్మ. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి రెడీ అయ్యాడు.
Also Read : బూమ్రా గొప్పతనం నా మనవళ్ళకు చెప్తా: ట్రావిస్ హెడ్
తిరిగి ఫాంలోకి రావడానికి అడిలైడ్ ఓవల్ లో జరగబోయే పింక్ బాల్ టెస్ట్ లో గేర్ మార్చడానికి రోహిత్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. మంగళవారం అడిలైడ్ ఓవల్‌లో నాలుగు గంటల పాటు సాగిన నెట్ సెషన్ లో రోహిత్ తీవ్రంగా కష్టపడ్డాడు. యువ బౌలర్లు వేసిన బంతులను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఒకరకంగా నెట్స్ లో డబుల్ షిఫ్ట్ చేసాడు రోహిత్. ప్రాక్టీస్ సెషన్ సమయంలో, భారత జట్టుకు ప్రాక్టీస్ అరేనాలో నాలుగు నెట్ లు ఏర్పాటు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ నెట్స్ లో ఒక నెట్ లో జైస్వాల్, రాహుల్ వంతులవారీగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసారు.
రెండవ నెట్‌లో శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేసారు. రోహిత్ మరో నెట్ లో రిషబ్ పంత్‌తో కలిసి ప్రాక్టీస్ చేసాడు. చివరి నెట్ లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇలా నెంబర్ 1 నుంచి నెంబర్ 8 వరకు భారత్ బ్యాటింగ్ లైనప్ ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ సెషన్ కు రోహిత్, పంత్ తో కలిసి… ఇతర సహాయక సిబ్బందితో పాటుగా ఒక గంట ముందుగానే వచ్చాడు. రోహిత్ వీక్ పాయింట్స్ లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసాడు. సైడ్-ఆర్మ్ త్రోడౌన్ బాల్స్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేసాడు.
Also Read : షమిని ఆడించాలా వద్దా.. భయపడుతున్న గంభీర్
రోహిత్ ప్రాక్టీస్ సెషన్‌లో బెంగాల్ ఫాస్ట్ బౌలింగ్ ద్వయం ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ (రిజర్వ్ పేసర్) ఆకట్టుకున్నారు. ముకేష్ అయితే రోహిత్, విరాట్, గిల్ ముగ్గురికి బంతులు విసిరాడు. కొత్త పేస్ సంచలనం హర్షిత్ రాణా, కూడా వీరికి బౌలింగ్ చేసాడు. రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా కోచ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో జరిగింది. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో రోహిత్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసాడు. మోకాలి కిందకు బంతులు వేయించుకుని ప్రాక్టీస్ చేసాడు. మరి రోహిత్ పింక్ బాల్ టెస్ట్ లో ఎంత వరకు రాణిస్తాడో చూడాలి.




