ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్.. అంటే క్రికెట్ ప్రపంచంలో పసికూన మాత్రమే. ఆ దేశంలో ఉన్న పరిస్థితులు గాని.. అక్కడ రాజకీయ పరిణామాలు అన్నీ కూడా అసలు క్రికెట్ కు ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కావు. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఆఫ్గనిస్తాన్ క్రికెట్ పై పెట్టిన స్పెషల్ ఫోకస్ ఆ దేశ క్రికెట్ గతినే మార్చేసింది. ఆ దేశంలో క్రికెట్ పై ఇష్టం ఉన్న ఆటగాళ్ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు.. ఆ దేశ క్రికెట్ ను తారస్థాయికి తీసుకెళ్ళాయి. క్రికెట్ ఆడే ముస్లిం దేశాల్లో ఆఫ్గనిస్తాన్ ను ప్రోత్సహించిన భారత్ అక్కడ యువ ఆటగాళ్లను సాన పెట్టేందుకు వాళ్లను ఐపీఎల్లో కూడా ఆడించే దిశగా అడుగులు వేసింది.
Also Read : ఇంగ్లాండ్ కు అయినా యువ బౌలర్ వస్తాడా…?
ఇక తాజాగా వాళ్ళ ప్రదర్శన చూసిన భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంగ్లాండ్ లాంటి జట్టుపై 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో.. నిలబడి ఏకంగా 325 పరుగులు చేసి, ఆ తర్వాత చిరస్మరణ విజయాన్ని అందుకున్న ఆఫ్గనిస్తాన్.. ఆటతీరు క్రికెట్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. అంతర్జాతీయ స్థాయి ఆట తీరుతో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్ళు దుమ్మురేపారు. ఇంగ్లండ్ లాంటి అగ్ర జట్టుపై ఏమాత్రం తడబడకుండా తమ టాలెంట్ మొత్తం బయటపెట్టారు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవడం అంతర్జాతీయ పోటీల్లో సహజం. కానీ మొదట్లోనే వికెట్లు కోల్పోయినా ప్రతిఘటించి పుంజుకున్న ఆఫ్ఘన్ జట్టు పోరాటపటిమ ప్రేక్షకులని ఆకట్టుకుంది.
Also Read : ఒంగోలులో ఖాళీ అయిపోతున్న వైసీపీ
ఒకానొక దశలో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని భావించిన సమయంలో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఇంగ్లాండును టోర్నీ నుంచి బయటకు పంపించారు. ఓవైపు పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్లో ఇబ్బందులు పడుతున్న సమయంలో పసికూనగా వచ్చిన.. ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్ గడ్డపై చెలరేగిపోయి ఆడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ ఎంత పట్టిష్టంగా ఉందో ఇంగ్లాండుతో మ్యాచ్ లో స్పష్టంగా అర్థమైంది. టాప్ ఆర్డర్ విఫలమైనా సరే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు నిలకడగా రాణించి జట్టు భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఓపెనర్ జద్రాన్ తో కలిసి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు స్కోరు బోర్డును పరుగులు పట్టించారు. ఏది ఎలా ఉన్నా ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ సాధించిన విజయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.




