దేవాదాయ శాఖ పరిధిలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఆరుగురు మృతి చెందారు. ఆ తర్వాత తాజాగా సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలకు కారణాలేమిటి.. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా.. ప్రమాదాన్ని రాజకీయం చేస్తోంది ఎవరు.. అనే విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెండు ప్రమాదాలు కూడా ఊహించనివే. ఈ రెండు ప్రమాదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు కూడా వస్తోంది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇందుకోసం తిరుపతిలో 2 రోజుల ముందు నుంచే టికెట్లు జారీ చేస్తారు కూడా. ఇది ప్రతి ఏటా జరుగుతుంది. అలాగే ఏడాదికోసారి వైశాఖ శుద్ధ తృతీయ నాడు సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు.
Also Read : పవన్ రాకతో విభేదాలు తొలగినట్లేనా..?
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావన ఎక్కువగా ఉంది. సెలవు రోజుల్లో ఆలయాల దర్శనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి సారించింది. ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించాలి కదా.. అనే సామెత మాదిరిగా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. దానిని అమలు చేయాల్సిన అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం. ప్రతి ఏడాది తిరుపతిలో ముందు రోజే టోకెన్లు ఇస్తారనే విషయం అధికారులకు తెలుసు. ఇందుకోసం దాదాపు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారని కూడా తెలుసు. అలాగే టోకెన్ల కోసం భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారని అధికారులు ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగినట్లుగా టీటీడీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసింది. కానీ ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తొక్కిసలాట కారణంగా ఏకంగా ఆరుగురు భక్తులు మృతి చెందారు. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి ఇలాంటి ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది టీటీడీకి ఒక మాయని మచ్చ అనే చెప్పాలి.
Also Read : అడ్డంగా దొరికిన సజ్జల, రిపోర్ట్ రెడీ
ఇక సింహాద్రి అప్పన్న సన్నిధిలో కూడా ప్రతి ఏటా చందనోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా భారీగా నిధులు కేటాయిస్తుంది. అలాగే దాదాపు నెల రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సింహాచలంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తగిని ఏర్పాట్లు చేస్తారు. చివరికి వీఐపీ పాస్‌ల జారీ విషయంపై కూడా చర్చిస్తారు. ఎండ వేడిమి దృష్టిలో పెట్టుకుని భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, ప్రత్యేక టికెట్ల జారీ.. ఇలా ఎన్నో విషయాలపై అధికారులు ముందుగానే ప్లానింగ్ చేస్తారు. క్యూలైన్ ఎంత దూరం ఉండాలనే విషయంపై నెల రోజుల ముందు నుంచే పక్కప్రణాళికతో ముందుకు వెళ్తారు. ఈ ఏడాది కూడా సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి కూటమి ప్రభుత్వం దాదాపు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై నెలన్నర ముందు నుంచే జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించారు. క్యూలైన్ ఏర్పాటులో భాగంగానే పెద్ద గోడ కూడా నిర్మించారు. అయితే భారీ వర్షానికి ఆ గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఇది సింహాచలం చరిత్రలో తొలిసారి జరిగిన ప్రమాదం.
Also Read : చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?
ఈ రెండు ప్రమాదాల్లో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట సమయంలో ఓ డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ముందుగానే గేట్లు తెరిచారు. దీంతో భక్తులు ఒక్కసారిగా పరిగెత్తడంతో ముందు ఉన్న భక్తులు కిందపడిపోయారు. వారికి ఊపిరాడకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అటు సింహాచలం ప్రమాదం విషయంలో కూడా గోడ నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నెలన్నర ముందు నుంచే ప్రణాళికలు రూపొందించినప్పటికీ.. చివరి రోజుల్లో హడావుడిగా గోడ నిర్మించాల్సిన అవసరం ఏమిటనే విషయం ఇప్పుడు ఎవరికీ అర్థం కావటం లేదు. గోడ నాణ్యతను పరిశీలించిన అధికారి ఎవరు.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడ పక్కనే వేలాది మంది భక్తులను క్యూ లైన్‌లో ఎలా అనుమతిస్తారు.. ఇవే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : అమరావతి అన్ స్టాపబుల్.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది అనేది వాస్తవం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ పలు శాఖల్లో కీలక పోస్టులో గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారులే ఉన్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు పదే పదే చెబుతున్నారు కూడా. అధికారులను ఏమైనా అంటే.. వారికి సీఎం అండగా ఉంటున్నారనే భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధుల మాట వినాల్సిన అధికారులు.. వారిపైనే పెత్తనం చేస్తున్నారు. కొందరు అధికారులు అయితే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనే ఎదిరిస్తున్న పరిస్థితి. ఇలాంటి వారికి చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో కూటమి సర్కార్‌కు మరిన్ని తలనొప్పులు వస్తాయనే మాట బలంగా వినిపిస్తోంది.




