తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించిన ఏపీ సర్కార్… జీవో జారీలో మాత్రం జాప్యం చేస్తోంది. బోర్డు ప్రకటించి ఇప్పటికే రెండు రోజులు గడిచినప్పటికీ… జీవో మాత్రం జారీ చేయలేదు. ఇందుకు పెద్ద కారణమే ఉందంటున్నారు టీడీపీ నేతలు. వాస్తవానికి గతంలో కార్పోరేషన్ పదవుల జాబితా విడుదల చేసినప్పుడు అయితే… వెంటనే ఆర్డర్ కూడా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఆ సమయంలో కొంతమంది నేతలు అసంతృప్తికి గురైనప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీటీడీ బోర్డు విషయంలో మాత్రం కాస్త వెనుకడుగు వేస్తోంది.
జీవో జారీ ఆలస్యం వెనుక ప్రధానంగా పార్టీ నేతల అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల దివ్య క్షేత్రంలో అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపించారు. అదే సమయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని కూడా ఆరోపించారు. దీనిపై విచారణకు ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డులో కొందరికి వరుసగా రెండోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. దీనిపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు
అలాగే నిన్నటి వరకు వైసీపీలో కొనసాగిన నేతలు… సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అలాంటి వారికి వెంటనే పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గత బోర్డులో సభ్యులుగా ఉన్న జంగా కృష్ణమూర్తి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు అమిత్ షా రికమండ్ చేసిన డాక్టర్ అదిత్ దేశాయ్, తమిళనాడుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం తమ్ముడు రామ్మూర్తికి ఈసారి మరో అవకాశం కల్పించారు చంద్రబాబు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ నేతలతో పాటు శ్రీవారి భక్తులు కూడా తప్పుబడుతున్నారు.
నిన్నటి వరకు అక్రమాలు జరిగిన సమయంలో సభ్యులుగా ఉన్నవారికే మరో అవకాశం ఎందుకు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జరిగిన అక్రమాలు… మరోసారి రిపీట్ అవ్వవనే గ్యారంటీ ఏమిటని కూడా నిలదీస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రకటించిన బోర్డులో ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. అందుకే జీవో జారీలో జాప్యం జరుగుతోందంటున్నారు ప్రభుత్వ పెద్దలు. మరి గెట్ అవుట్ అయ్యేది ఎవరో… స్వామి సేవలో తరించేది ఎవరో తెలియాలంటే… జీవో జారీ వరకు వేచి చూడాల్సిందే.




