బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ వ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? పాదయాత్ర ఆలోచన వెనుక కారణాలేంటి? ఫాంహౌస్ ఘటన తర్వాత కేటీఆర్ ఆలోచన తీరు మారిందా? ఇకపై సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ పనిచేయనున్నారా? పాదయాత్రతో బీఆర్ఎస్‌లో ఎదురులేని నేతగా కేటీఆర్ ఎదగాలనుకుంటున్నారా? ఆయన వ్యూహాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్ కోరుకుంటే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశమే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని ఆయన అన్నారు. ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర అంశం చర్చకు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తెలంగాణకు శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని కేటీఆర్ నెటిజన్లతో అన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగినంత నష్టం తెలంగాణకు ఎప్పుడూ జరగలేదన్నారు బీఆర్ఎస్ నేత. ప్రధాన ప్రతిక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావటం కోసం పనిచేయబోతున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ పాదయాత్ర వార్త.. సొంత పార్టీ బీఆర్ఎస్‌తో పాటు.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నట్లు తెలిపిన కేటీఆర్… అయితే తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్ర వెనుక మరో కోణం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంతో… తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
Also Read : నీకో నీతి… నాకో నీతి… ఇదే రాజనీతి…!
అయితే ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం, హైడ్రా కూల్చివేతల అంశాలు బీఆర్ఎస్‌కు ఊపిరి పోశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం పార్టీ కీలక నేతలు అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కండువా కప్పుకోగా… మరికొందరు ఎమ్మెల్యేలు సైతం హస్తం నేతలతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొద్ది రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. సొంత నాయకులను కాపాడుకోవడంతోపాటు… క్యాడర్‌లో ఉత్సాహం నింపే బాధ్యత పార్టీ నేతలపై ఉంది. దీనిలో భాగంగానే కేటీఆర్ పాదయాత్ర ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు తమిళనాడులో అన్నా డీఎంకే మాదిరి బీఆర్ఎస్‌ను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారనే సమాచారం. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బృందం తమిళనాడులో స్టడీ టూర్ కోసం వెళ్లి వచ్చింది. మరోవైపు వైపు పాదయాత్రతో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ తమను, తమ కుటుంబాన్ని కావాలనే ఇబ్బందులు పెడుతున్నట్లు కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించటమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు సొంత పార్టీలో హరీష్ రావు, కవితలు… కేటీఆర్ కు కాంపిటీషన్‌గా ఉన్నారనే వాదన కూడా ఉంది. ఈ పాదయాత్రతో వీరిద్దరికి చెక్ పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే… ఆ క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని కేటీఆర్ భావిస్తున్నారట.
బీఆర్ఎస్ వర్గాలు ఉత్తరప్రదేశ్‌ను ఉదాహరణగా చెప్పుకుంటున్నాయి. 2012ఎన్నికల ముందు అఖిలేష్ యాదవ్ యూపీ వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించారు. 2012అసెంబ్లీ ఎన్నికలో యూపీలో ఎస్పీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ క్యాడర్.. ములాయంను కాదని.. అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసింది. దీంతో యూపీ సీఎంగా అఖిలేష్ బాధ్యతలు చేపట్టారు. ఇదే విధంగా కేటీఆర్‌కు అవకాశం వస్తోందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. నిజానికి కేటీఆర్, హరీష్ రావులు పోటాపోటీ కార్యక్రమాలతో క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ పాదయాత్ర వార్తలపై బండిసంజయ్ ఘాటుగా స్పందించారు. ఏం ఉద్దరించారని పాదయాత్ర చేస్తారంటూ విమర్శించారు. తాము పాదయాత్రచేస్తే దాడులు చేశారని మండిపడ్డారు.
Also Read : చంద్రబాబు ఇంటికి వైసీపీ బిగ్ ఫిష్
కేటీఆర్ పాదయాత్ర మాటలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. హరీష్ రావును ప్రతిపక్ష నాయకుడిని చేస్తారన్న భయంతోనే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి పాదయాత్రకు సిద్దమైనట్లు ఆరోపించారు.
అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉండగానే.. రాజకీయాల్లో పాదయాత్ర ప్రస్థావనలు వస్తున్నాయి. కేటీఆర్ ఎన్నికలకు రెండు ఏళ్ల ముందు పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాదయాత్రలతో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన సంఘటనలే నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్, నారా లోకేష్ యువగళం యాత్ర చేసి సక్సెస్ అయ్యారు. అయితే కేటీఆర్ చేపట్టే పాదయాత్ర బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తుందో వేచిచూడాలి.




