హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం మంగళగిరి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు కొనసాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా హైడ్రా వ్యవస్థ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు చర్యలు, వాటి వలన తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలు, రాజకీయ ప్రతిస్పందనలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో 40 వేల కోట్ల విద్యుత్ కుంభకోణం.. ఏబీవీ సంచలన ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న హైడ్రా కమీషనర్‌గా రంగనాథ్ ఉన్నారు. కనుక ఆయన మంగళగిరికి రావడం, డెప్యూటీ సిఎంతో ఇంత సమగ్రంగా సమావేశం కావడం యాదృచ్ఛికం కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అటవీశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని అటవీ భూములు, కొల్లేరు సరస్సు పరిధి, ప్రభుత్వ భూముల కబ్జాల సమస్యలపై చర్చ జరిగి ఉండొచ్చని అంచనా.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ భూకబ్జా కేసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా విధానం, అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ రంగనాథ్ నుంచి సలహాలు తీసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
అయితే, తెలంగాణలో హైడ్రా చర్యలు ప్రతి సారి హైకోర్టులో నిలిచిపోవడం, బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎదురవడం తెలిసిందే. హైడ్రా కూల్చివేతల వలన “హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది” అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా హైడ్రా అంశం కీలకమైంది. కాంగ్రెస్ గెలిస్తే “హైడ్రా బుల్డోజర్లు మన ఇళ్ళ మీదకు వస్తాయి” అనే భయాన్ని బీఆర్ఎస్ ప్రచారంలో వినియోగిస్తోంది.
Also Read : బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి..?
ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వస్తే, దాని రాజకీయ ప్రభావాలను ముందుగా అంచనా వేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే తెలంగాణలో హైడ్రా వలన ఎదురైన విమర్శలు, వివాదాలు, న్యాయపరమైన అడ్డంకులు — ఆంధ్రప్రదేశ్‌లో మరింత తీవ్రంగా తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.




