ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో విజయవాడలో వరదలను సామాన్య ప్రజలు చూడలేదు. విజయవాడ అంటే ఎండలు మాత్రమే గాని వరదలు ఉండవు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. బుడమేరు దెబ్బకు విజయవాడలో వరదలు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ వరదల్లో ప్రభుత్వ పని తీరు మాత్రం ప్రజలకు చాలా సంతృప్తిని ఇచ్చింది అని చెప్పక తప్పదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ పని చేయడం చాలా మందికి సంతోషాన్ని ఇచ్చింది.
నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్య ప్రసాద్ ఇలా అందరూ దృష్టి పెట్టి పని చేసారు. నారాయణ అయితే ఆహార పంపిణీ నుంచి ప్రతీ ఒక్కటి వరద బాధిత ప్రాంతాలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కొల్లు రవీంద్ర అయితే ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఏమైనా ఆదేశాలు కావాలంటే వెంటనే జారీ చేస్తున్నారు. ఆయన ఇల్లు కూడా వరద నీటిలోనే ఉన్నా, అది పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడటం ప్రజల్లో ఆయన ఇమేజ్ అమాంతం పెంచేసింది.
Read Also : మోపిదేవి వైసీపీ కి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?
ఇక నిమ్మల రామానాయుడు విషయానికి వస్తే ఈ వరదల్లో చంద్రబాబు తర్వాత ఈయనే హీరో. బుడమేరు గండి పూడ్చే విషయంలో రామానాయుడు పని తీరు చాలా బాగా నచ్చింది జనాలకు. వర్షంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు. గండి పూడ్చిన తర్వాతనే బయటకు వచ్చారు. గొట్టిపాటి, అనగాని విషయానికి వస్తే… బాపట్ల దగ్గర కృష్ణా నదికి గండి పడటంతో గండి పూడ్చే వరకు ఇద్దరూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తూ వరుస పర్యటనలు చేసారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డారు. ఇక వంగలపూడి అనిత, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… వీళ్ళు అందరూ ఈ వరదల్లో కీలకంగా పని చేసి బాధితులకు అండగా నిలబడ్డారు.
మొత్తం మీద అధికార యంత్రాంగం సమిష్టి కృషితో వరద ఇబ్బందుల నుంచి ప్రజలు త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి వచ్చేసారు అని చెప్పుకోవచ్చు. వరద ఇబ్బందులను అధికమించడం ఒక ఎత్తు అయితే.. వరద సహాయ చర్యలు మరో ఎత్తు. వరదలతో ఇబ్బంది పడ్డ ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఆహారం సరఫరా జరుగుతూనే ఉంది. వరద తగ్గగానే ఫైర్ ఇంజిన్లతో వీధులతో పాటు, ఇళ్ళని కూడా శుభ్రం చేయడం కీలక అంశం. ద్విచక్ర వాహనాలు, కార్లని రిపేర్ చేయడం కోసం మెకానిక్ లని ఇంటి వద్దకే పంపించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయవాడ ప్రజలకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఇది ఒక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చు.