తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు అనేవి అత్యంత సహజం. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కోడిపందాల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి కోడిపందాలు ఆడిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక దీనికి పోలీసు అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అనే విమర్శలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పేకాట, కోడిపందాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.
Also Read : శ్రీలేఖకు టీడీపీ క్యాడర్ మద్దతు.. ప్రభుత్వంపై విమర్శలు
తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి ఒక దుమారం రేగింది. భీమవరం డిఎస్పి జయ సూర్య.. పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని, కోడిపందాలకు సహకరిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. దీనితో వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. డీఎస్పీ వ్యవహారానికి సంబంధించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ అంశానికి సంబంధించి ఆరా తీశారు. హోం మంత్రిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.
Also Read : డీఎంకే నేతలతో కలిసి వైసీపీ కల్తీ వ్యాపారం..?
ఇక డిఎస్పి పై చర్యలు తీసుకోవడం లాంచనమే.. అని భావించిన తరుణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజమన్న ఆయన.. 13 ముక్కల ఆట నేరం కాదన్నారు. కానీ పేకాట పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని.. గత కొన్ని రోజులుగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట లాంటి జూదాలు జరగడం లేదన్నారు. జయసూర్య ఒక మంచి అధికారీ అని కితాబిచ్చారు రఘురామకృష్ణంరాజు.