వైసీపీ మాజీ మంత్రి, పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పటికే మదనపల్లె ఆర్డీవో ఆఫీసు వ్యవహారంలో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఇది ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్ లో తన పేరుపై ఉన్న ఆస్తులను చూపలేదని 142 ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించలేదని పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
బుధవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా… ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్య చేసింది. పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు.. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీడ్ చేయండి” అంటూ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఆ 142 ఆస్తులు పూర్తిగా ఆధారాలున్నాయని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి ఎక్కడా కూడా తప్పించుకునే అవకాశం లేకుండా ఆయన పిటీషన్ వేసినట్టు తెలిసింది. దీనిపై సీరియస్ గా తీసుకున్న న్యాయస్థానం… ప్రతివాదులకు నోటీసులిచ్చి, ఈరోజు ఇంప్లీడ్ కూడా ఆదేశించడం జరిగింది. ఇదిలా ఉంచితే ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఉండటంతోనే ఆయన దొరకకుండా తప్పించుకునేందుకు మదనపల్లెలో నిప్పు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ 142 భూ రికార్డులు పెద్దిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్నవే అంటూ రామచంద్ర యాదవ్ ఆధారాలతో సహా కోర్టుకి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.




