బైక్ ట్యాక్సీ.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే.. తక్కువ ఖర్చుతో రయ్ రయ్ అంటూ వెళ్లిపోతున్నాం. ఏ టైమ్ అయినా సరే.. జస్ట్ ఏ క్లిక్‌తో మీ ముందుకు మా ట్యాక్సీ అంటూ ఆన్ లైన్ సంస్థలు తెగ ఊదరగొడుతున్నాయి. పైగా చెప్పిన దాని కంటే తక్కువ చెల్లింపు.. ఆఫర్లు, క్యాష్ బ్యాక్, షేరింగ్ రైడ్.. సేఫ్ అండ్ సెక్యూర్.. ఇలా ఎన్నో తాయిలాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇక ఒకటి అరా ఘటనలు తప్ప బైక్ ట్యాక్సీల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవనేది కస్టమర్ల మాట. సేఫ్‌గా తక్కువ ఖర్చుతోనే ఇంటికి చేరుకున్నాం అంటూ రివ్యూలు, రివార్డులు, ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే బైక్ ట్యాక్సీల అంశం పెద్ద దుమారం రేపుతోంది. అసలు బైక్ ట్యాక్సీలు అవసరం లేదనే స్థాయిలో ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
Also Read : తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!
ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు బైక్, ఆటో, కారు ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్నాయి. మొదటగా మెట్రో నగరాల్లో ప్రారంభమైన ఈ ట్యాక్సీ సర్వీసులు.. నెమ్మదిగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో కూడా ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించేందుకు ర్యాపిడో ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. కనీసం ఒక్క సొంత వాహనం కూడా లేకుండా.. కేవలం ఏజెంట్ల ద్వారానే ఏడాదికి వందల వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి ఈ సంస్థలు. ముందు ట్యాక్సీ సర్వీసు కింద ప్రారంభమైన సేవలు.. ఇప్పుడు పార్శిల్ సర్వీసు కూడా నిర్వహిస్తున్నాయి. ఒక దగ్గర నుంచి మరొ దగ్గరికి సులువుగా చిన్న చిన్న పార్శిల్స్‌ను తక్కువ ఖర్చుతోనే అందిస్తున్నాయి. దీని వల్ల సమయం కూడా వృధ కావటం లేదనేది వినియోగదారుల మాట.
Also Read : కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది ఆ ఇద్దరే..!
అయితే ఆన్ లైన్ బైక్ ట్యాక్సీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆటో, ట్యాక్సీ నిర్వాహకులు వాపోతున్నారు. తమకు గిరాకీలు రావటం లేదని.. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. పలు చోట్ల ఈ విషయంపై బైకర్లతో ఆటో డ్రైవర్లు గొడవలు కూడా పడుతున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల వద్ద బైక్ ట్యాక్సీలు ఉండటం వల్ల గంటల తరబడి వేచి ఉన్నా కూడా తమకు కిరాయిలు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక ప్రయాణీకుల నుంచి బైకర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ బైక్ ట్యాక్సీల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వంతో పాటు అక్కడి హైకోర్టు కూడా ఈ బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది.
Also Read : పని వేళల్లో మార్పు.. ఎందుకీ సవరణ..?
ప్రధానంగా మహిళలకు రక్షణ లేదని.. అలాగే ప్రైవేటు నంబర్ ప్లేట్ తీసుకుని.. వాటిని కమర్షియల్ కింద వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సొంత వాహనం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత.. కేవలం సొంత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని వెల్లడించింది. కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నంబర్ ప్లేట్ రంగు మారుతుంది. అప్పుడు అది ట్యాక్సీ అనే విషయం సులభంగా తెలిసిపోతుంది. ఇక కమర్షియల్ వాహనం వల్ల ప్రభుత్వానికి ప్రతి 3 నెలలకు ఓసారి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇక ప్రమాదాలకు గురైన సమయంలో కమర్షియల్ వాహనాల్లో ప్రయాణించే వారితో పాటు, పాదచారులకు కూడా బీమా వర్తిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బైక్ ట్యాక్సీలపై కర్ణాటక సర్కార్ బ్యాన్ విధించింది. 2021లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ కూడా గతేడాది రద్దు చేసింది. దీని వల్ల ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణానికి మేలు కూడా జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కొందరు ఎలక్ట్రిక్ బైక్ బదులుగా మామూలు వాహనాలు ఉపయోగిస్తున్నారని.. ఇది మోటరు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడంతో ఆటోలు, ఇతర ట్యాక్సీల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




