బీజేపీ నేతలకు మరో భయం మొదలైనట్లు తెలుస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. దీంతో గతంలో కంటే కాస్త దూకుడు తగ్గించారనేది వాస్తవం. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభలో మోదీ సర్కార్‌ను నిలదీస్తూనే ఉంది. ఇక సభలో ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని నిలువరించటం బీజేపీ నేతలు కాస్త కష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అన్న రాహుల్ గాంధీకి చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా జతకలవనున్నారు.
Also Read : కమ్మ జిల్లాల్లో రెడ్ల ఆధిపత్యం
గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ… కేరళలోని వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ… ఉప ఎన్నికలో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అటు బీజేపీ, సీపీఎం అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ.. వయనాడ్ ఓటర్లు మాత్రం ఇందిరను పోలిన ప్రియాంకకే ఓట్లు వేశారు. దాదాపు 4 లక్షల పైచిలుకు ఓట్లతో వయనాడ్ నుంచి ప్రియాంక విజయం సాధించారు.
Also Read : ఆ పదవుల భర్తీ ఎప్పుడు బాబు గారు..?
మరో వారం రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రస్తుత ఉప ఎన్నికలో విజయం సాధించిన ప్రియాంక ఈ సమావేశాల నుంచే సభలో కాలు పెట్టనున్నారు. ఇదే విషయం ఇప్పుడు బీజేపీ నేతలను కలవరపరుస్తోంది. ఇప్పటికే అదానీ అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సభలో మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి లెక్కలతో సహా వివరించారు. పార్లమెంట్‌లో నిలదీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక కూడా తోడైతే… కాంగ్రెస్ నేతలకు మరింత బలం చేకూరుతుంది. ఇప్పటికే బహిరంగ వేదికలపై మోదీ సర్కార్ తీరుని ప్రియాంక ఎండగట్టారు. ఇక చట్టసభలోకి వస్తే… నేరుగా ప్రియాంక ఇంకెన్నీ అస్త్రాలు సంధిస్తారో అని కమలం పార్టీ నేతలు కలవరపడుతున్నారు.