ఏపీలో రాజకీయాలు 2024 వరకు ఒక లెక్క, ఆ తరువాత ఒక లెక్క అన్నట్లు తయారయ్యాయి. ఎన్నికలకు ముందు వరకు… జనసేన ఆధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించని వైసీపీ నేతలు లేరు అంటే అతిశయోక్తి లేదు. ముగ్గురు పెళ్ళాలు, రెండు నియోజకవర్గాలు ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేసారు. కొందరు అయితే రింగ్ లోకి వస్తే ఒక గుద్దుకే లేపేస్తాం అని కూడా మాట్లాడారు. ఇప్పుడు కథ మారింది… సాధారణ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యారు. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసి 11 గెలిస్తే… పవన్ 21 పోటీ చేసి 21 గెలిచారు.
ఇప్పుడు పవన్ కీలక శాఖలకు మంత్రి. జగన్ భవిష్యత్తు కంటే పవన్ భవిష్యత్తే ఆశాజనకంగా కనపడుతుంది ప్రజలకు. ఇక పవన్ కూడా తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు మీదనే ఎక్కువగా ఫోకస్ చేసారు. సాధారణంగా చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా… వారి కోరికలు తీర్చడానికే ఆయనకు సమయం సరిపోయేది. లేదంటే మీడియా ముందు చిందులు. ఇప్పుడు పవన్ నుంచి వాతావరణం చంద్రబాబుకి చాలా సౌకర్యవంతంగా ఉంది. పొత్తు ముందు సీట్ల గొడవ లేదు, ఎన్నికల తర్వాత పదవుల గోల లేదు. మూడు మంత్రి పదవులు తీసుకున్నారు. పవన్ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం లేదు. కేవలం చంద్రబాబుని చూసి నేర్చుకోవడం మాత్రమే ఉంది.
Read Also : బిజెపి విషయంలో బాబు సూపర్ సక్సెస్.. ఇవిగో ఆధారాలు
కాని వైసీపీ విషయంలో మాత్రం పవన్ చాలా కఠినంగా ఉన్నారు. తన పార్టీ బ్రతకాలి అంటే వైసీపీ ఉండకూడదు అనే ఆలోచనలో ఉన్న పవన్… కీలక నేతలకు వచ్చేయండి అనే సంకేతాలు ఇచ్చారు. ఆ వచ్చే వాళ్ళ నుంచి టీడీపీకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. పది మంది మాజీ ఎమ్మెల్యేలు పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో చాలా మంది నేతలు పార్టీ మారే అవకాశం ఉండవచ్చు. ఆ వచ్చే వాళ్ళు కూడా పెద్ద పెద్ద కోరికలతో ఏం వైసీపీ నుంచి వచ్చే ప్రయత్నం చేయడం లేదు.
ఇక చంద్రబాబు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పక్కాగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ మంత్రులు మాట్లాడినా లేకపోయినా పవన్ మాత్రం తన మార్క్ సమాధానాలు ఇస్తున్నారు. చంద్రబాబు ఎలా పని చేస్తారో టీడీపీ నాయకులు చెప్తే జనాల్లోకి వెళ్ళదు. కాని పవన్ చెప్తే వెళ్తుంది. వైసీపీకి సైలెంట్ గా కౌంటర్ లు ఇస్తున్నారు. వైసీపీని అధఃపాతాళానికి తోక్కుతా అని చెప్పారు పవన్. 11 స్థానాలు కాదు… అసలు పార్టీనే లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారని గురువారంతో చాలా మందికి క్లారిటీ వచ్చేసింది.