అసలు ఇది హత్యా.. లేక ప్రమాదమా.. ఏం జరిగింది.. ఎలా చనిపోయారు.. పోలీసులు నిజాలు దాస్తున్నారా.. వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదు.. పెడితే కొత్త తలనొప్పులు వస్తాయని పోలీసులే వెనుకడుగు వేస్తున్నారా.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇవే ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్న ప్రశ్నలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ పైన ప్రయాణం చేసిన ప్రవీణ్.. హెడ్ లైట్ వేయకుండా.. కేవలం బండి సైడ్ ఇండికేటర్ మాత్రమే వేసుకుని ప్రయాణం చేసినట్లు పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది. కోవ్వూరు టోల్ గేట్ వద్ద బైక్ వెళ్తున్న విజువల్స్‌ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో ప్రవీణ్ డ్రైవింగ్ చేస్తున్న బైక్ లైట్ లేదు.. పైగా తడబాటుకు గురవుతోంది. అసలు హెడ్ లైట్ కూడా వేసుకోకుండా ఎందుకు ప్రవీణ్ ప్రయాణం చేశాడు. అంత రాత్రి పూట అలా కేవలం ఒక సైడ్ ఇండికేటర్తోనే ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : కొడాలి నాని గుండెకు ఏమైందంటే..!
వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం లభ్యమైన వెంటనే.. పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేశారు. రోడ్డు ప్రమాదం వల్లే మృతి చెందినట్లు నివేదిక కూడా ఇచ్చారు. అయితే.. ప్రవీణ్ మృతిపై ముందు ఎలాంటి అనుమానాలు రాలేదు. కానీ ఒక వర్గం మీడియా మాత్రం ఇది హత్య అంటూ ప్రచారం చేయడంతో.. అందరూ నిజమేనేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రవీణ్ పగడాల మృతదేహం ఉన్న రాజమండ్రి ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఇది చిన్నగా పొలిటికల్ రంగు పులుముకుంది. పాస్టర్ హత్య అంటూ ఆరోపణలు చేశారు. ఓ వర్గంపై దాడి అనే కోణంలో ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గానే తీసుకుంది. అన్ని కోణాల్లో పరిశీలించాలని ఆదేశించింది. దీంతో కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి విచారణ కొనసాగిస్తామన్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.. త్వరలోనే నిజాలు వెలికి తీస్తామని ప్రకటించారు.
Also Read : వైసీపీకి గ్రోక్ షాక్.. ఏం చెప్పిందంటే..
అయితే పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు రిపోర్టులో వస్తే.. దానిపై కూడా దుమారం రేగుతుందేమో అని పోలీసులు భయపడుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఇదే విషయంపై పలువురు వ్యాఖ్యలు కూడా చేశారు. హత్య చేసే ముందే బలవంతంగా మందు తాగించారని.. పోస్టుమార్టం రిపోర్టులో మద్యం సేవించినట్లు వస్తుంది కాబట్టి ప్రమాదం వల్లే చనిపోయినట్లు నమ్మిస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది లాభం కోసమా, కక్షతోనా, రాజకీయ కుట్రతో జరిగిందా అని అనుమానిస్తున్నారు. ముందుగా ఊహించినట్లే పోస్టుమార్టం రిపోర్టు వస్తే మాత్రం.. దీని వెనుక పెద్ద తలలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టు బయట పెట్టేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు రిపోర్టు రిలీజ్ చేస్తారా… చేస్తే.. అందులో ఏమని వస్తుంది.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.