నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు.. నచ్చక పోతే తీవ్రంగా విమర్శలు చేస్తారు. ఇవే ఇప్పుడు పాలిటిక్స్. ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే క్రూరంగా కూడా. మన అనుకుంటే.. ఆహో ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. అదే కొంచెం తేడా వచ్చినా సరే.. తల్లి, చెల్లి అనే విషయాలు కూడా గుర్తుకు రావు. నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తారు. ఇదంతా కేవలం అధినేతకు ప్రసన్నం చేసుకునేందుకా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. అలాగే స్వార్థ ప్రయోజనాలు కూడా ఓ ప్రధాన కారణం.
Also Read : గ్లాస్ స్కై వాక్ పాలిట్రిక్స్.. మా వల్లే అంతా..!
నిన్నటి వరకు మీరు సూపర్.. మీ మాట సూపర్.. మీ బాటలోనే మేమంతా అని గొప్పగా చెప్పిన అభిమానులు.. కొంచెం తేడా వస్తే మాత్రం.. సీమ టపాకాయల్లా పేలిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏ మాట్లాడుతున్నారు.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయం కూడా పూర్తిగా విచక్షణ కోల్పోతున్నారు. నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో జగన్ వెంటే నడిచిన షర్మిల.. ఆస్తి విషయంల అన్న మోసం చేశారనే ఆక్రోశంతో ఆయనతో విబేధించి కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే.. వెంటనే ఆమెపై నీచమైన కామెంట్లు చేశారు వైసీపీ శ్రేణులు.
అదే తరహాలో తెలంగాణలో కూడా హరీష్ రావు మీద ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. దీంతో కారు పార్టీ అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కవితను నానా మాటలన్నారు. ఆమె ఫ్లెక్సీలు తగులబెట్టారు. కవిత ఆస్తులు ఎంత.. ఎలా వచ్చాయంటూ విమర్శలు చేస్తున్నారు. అటు షర్మిల గురించి, ఇటు కవిత గురించి కూడా ఇంటి పేరు విషయంలో నానా రచ్చ చేస్తున్నారు వైసీపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు. పెళ్లి అయిన తర్వాత కూడా వైఎస్, కల్వకుంట్ల అనే ఇంటి పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. షర్మిల పుట్టుకపైనే వైసీపీ శ్రేణులు కామెంట్ చేయగా.. కవిత ఇంటి పేరు బీఆర్ఎస్ నేతలు మార్చేశారు. దేవనపల్లి కవిత అని పిలవటం మొదలెట్టారు. జగన్, కేటీఆర్‌తో కలిసి ప్రయాణం చేసినప్పుడు మాత్రం ఎలా ఎందుకు చేయలేదనేదో అర్థం కావటం లేదు.
Also Read : హడావుడిగా సచివాలయానికి లోకేష్.. కారణం ఇదే
ద్వితీయ శ్రేణి నేతల విషయంలో కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు. పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబితే చాలు.. విరుచుకుపడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు ఇదే సంస్కృతి ప్రారంభమైది. నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో కొందరు సీనియర్ నేతలకు డైరెక్టర్ పదవులిచ్చారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన అంగర రామ్మోహన్, ఆచంట సునీత, సప్తగిరి ప్రసాద్, శిష్ట్లా లోహిత్ వంటి నేతలు.. పదవి స్వీకరించటం లేదంటూ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన కొందరు కార్యకర్తలు.. అధినేత నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా.. అంటూ అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఛైర్మన్ పదవులు కావాలంటే ఎలా అంటూ బూతులు మాట్లాడుతున్నారు. పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పినప్పటికీ.. ఇలా బూతులు మాట్లాడటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.