తెలుగోడి సత్తాపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అది రాజకీయాలైనా, సినిమా అయినా, కార్పొరేట్ ఉద్యోగమైనా, క్రికెట్ అయినా సరే… తెలుగోడి క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా పుష్ప సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక పుష్ప మేనరిజమ్ కూడా ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు అదే మేనరిజమ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై ఓ తెలుగోడు సత్తా చాటాడు. బార్డర్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తెలుగు తేజం నితీష్ రెడ్డి చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై రన్స్ చేయడానికి సీనియర్లు ఆపసోపాలు పడుతుండగా.. బౌలర్లతో కలిసి భారత్ పరువు నిలబెట్టాడు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి.
Also Read: జారిపోతున్న మ్యాచ్ ను నిలబెట్టాడు.. ది బూమ్రా…!
221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఆదుకున్నాడు. లంచ్ విరామానికే 7 వికెట్లను భారత్ జట్టు కోల్పోయింది. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై ఆచితూచి ఆడాడు నితీష్. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడుతూ… అవకాశం వచ్చినప్పుడు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. 81 బంతులాడిన నితీష్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బౌండరీతో హాఫ్ సెంచరీ సాధించిన నితీష్.. మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రేక్షకులకు తానేమిటో చూపించాడు. తగ్గెదే లే అన్నట్లుగా బ్యాట్‌తో సైగ చేసి డ్రెస్సింగ్ రూమ్‌లో జోష్ నింపాడు.

8వ వికెట్‌కు సుందర్‌తో వంద పరుగులు జోడించిన నితీష్ రెడ్డి… ఆస్ట్రేలియా బౌలర్లకు కొరకరానీ కొయ్యగా మారాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నితీష్.. లెఫ్ట్ హ్యండ్, రైడ్ హ్యాండ్ బ్యాటింగ్‌తో స్ట్రైకింగ్ రోటోట్ చేస్తూ… బౌలర్లను తికమక పెడుతున్నాడు. నితీష్ రెడ్డి అంటే తొలి నుంచి దూకుడు స్వభావం మాత్రమే అందరికీ గుర్తుకు వస్తుంది. అలాంటి నితీష్ తొలిసారి నిలకడగా… ఇంకా చెప్పాలంటే ఓపికగా ఆడుతున్నాడు.

సరిగ్గా 50 పరుగులు చేసిన సుందర్‌ను లెయాన్ అవుట్ చేయడంతో… 8వ వికెట్ బాగస్వామ్యానికి తెర పడింది. బూమ్రా పరుగులేమి చేయకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హైదరాబాద్ స్టార్ సిరాజ్‌తో కలిసి ఆడిన నితీష్ రెడ్డి… బౌండరీతోనే కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాపై చిన్న వయసులో సెంచరీ చేసిన మూడో క్రికెటర్ నితీష్ రెడ్డి. సచిన్ 18 ఏళ్ళకు చేయగా… రిషబ్ పంత్ 21 ఏళ్ళ 94 రోజులకు చేసాడు. నితీష్ రెడ్డి 21 ఏళ్ళ 291 రోజులకు సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చిన భారతీయ ఆటగాళ్లల్లో నితీష్ మాత్రమే సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బాహుబలి మాదిరిగా బ్యాట్ కింద పెట్టి.. దానిపై హెల్మెట్ పెట్టిన నితీష్… చెయ్యి పైకి లేపి అభివాదం చేశాడు.