తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అందుకు ఏకైక కారణం కార్యకర్త. ఇంకా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే.. 40 ఏళ్లుగా కొనసాగుతుందంటే.. అందుకు కారణం కూడా కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా కార్యకర్త.. తర్వాతే నాయకుడు అంటారు అధినేత చంద్రబాబు. అందుకే ప్రతి రోజు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కూడా కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత అనేది చంద్రబాబు మాట. అలాంటి కార్యకర్తకే కష్టం వస్తే.. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.
Also Read : ఫేక్ బతుకులు.. వైసీపీపై లోకేష్ ఫైర్
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార దర్పం చూపిస్తున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో నానా పాట్లు పడిన తెలుగు తమ్ముళ్లు.. రెట్టించిన కసితో ఎన్నికల్లో పని చేశారు. జగన్ సర్కార్ పెట్టిన కేసులను తట్టుకున్నారు. గత ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడ్డారు. దాడులను ధీటుగా ఎదిరించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినా సరే.. ఓట్లు మాత్రం సైకిల్ గుర్తుకే పడేలా చేశారు. అంతలా కష్టపడిన కార్యకర్త ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాడు.
Also Read : నాగబాబు ఏమయ్యారు..? పవన్ తో గ్యాప్ వచ్చిందా?
తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కార్యకర్త మాత్రం నానా పాట్లు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కనీస గుర్తింపు కూడా లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇందుకు ప్రధాన కారణం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తీరు. కార్యకర్తకు కనీస గుర్తింపు ఇవ్వటం లేదనే మాట బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తను దగ్గరకు కూడా రానివ్వటం లేదంటున్నారు. కొంత మంది అయితే నిన్నటి వరకు వైసీపీ పెత్తనం చేసిన వారిని పార్టీలో చేర్చుకుని.. వారికే పెద్ద పీట వేస్తున్నారు కూడా. ఇక మరి కొందరి తీరు అయితే మరీ దారుణంగా ఉంది. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు ఎదగకుండా చేస్తున్నారు.
Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ – లాభాలు మరియు నష్టాలు
పార్టీ గెలుపునకు ఆర్థికంగా, సామాజికంగా చేయూత అందించిన కార్యకర్తను కొందరు ఎమ్మెల్యేలు పూర్తిగా పక్కన పెడుతున్నారు. చివరికి గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి నేత అయినా సరే.. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీ వేయిస్తే.. ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. తమ అనుచరులకు చెప్పి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఈ విషయం నేతలకు, కార్యకర్తలకు తెలియటంతో ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వారి గురించి అధినేతకు తెలిసినా కూడా.. ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇలాంటి వారిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.




