ఆంధ్రప్రదేశ్ లో నూతన రేషన్ కార్డుల కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో వైసీపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల విషయంలో అనేక ప్రకటనలు చేసిన సరే… ఆ తర్వాత చేతులెత్తేసింది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తారని ఎదురు చూశారు. అయితే ఇప్పుడు కూడా కాలయాపన తప్పడం లేదు. ఆర్థిక భారం లేకుండా కొత్త కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ వర్కౌట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం అనుమతి కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు.
Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్
ఇక ప్రస్తుతం మాజీ సీఎం జగన్ బొమ్మతోనే పాత కార్డులు చలామణిలో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో వేలాదిమంది ఎదురుచూస్తున్నారు. అర్హులైన వారందరికీ కొత్త కార్డుల జారీ ప్రక్రియ కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన అప్పటి ప్రభుత్వం… ఆ తర్వాత మాత్రం వాటి విషయంలో చర్యలు తీసుకోలేదు. ఇక జగన్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. కొత్త కార్డుల కోసం 3 లక్షల 36 వేల 72 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.
Also Read : ఎందుకీ మౌనం..? కొడాలి నానీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై కసరత్తు చేస్తున్నామని, ప్రతిపాదించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు ముందడుగు మాత్రం పడలేదు. దీనితో క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొత్తగా పెళ్లయిన వారికి, అలాగే గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో కార్డులు కోల్పోయిన వారికి కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరిస్తుంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రం వాటిపై ముందడుగు వేయడం లేదు.