ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏనుగులు భయపెడుతున్నాయి. ఎక్కడో ఒకచోట ఏనుగుల సంచారం ప్రజలను కంగారు పెడుతుంది. తాజాగా అన్నమయ్య జిల్లా గుండాల కోన శివాలయానికి భక్తులు వెళుతుండగా ఏనుగులు దాడి చేసి నలుగురు భక్తుల ప్రాణాలను హరించాయి. దీనితో మరోసారి ఏనుగుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఉపసర్పంచ్ ను ఏనుగులు చంపటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు ఉత్తరాంధ్రలో కూడా ఏనుగులు చుక్కలు చూపిస్తున్నాయి.
Also Read: కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల భయం..!
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న అడవుల నుంచి ఏనుగులు పదే పదే బయటకు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు ఏనుగుల సంచారం ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు లేవనే చెప్పాలి. తాజాగా భక్తులను ఏనుగులు హతమార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఇప్పటివరకు ముందుకు వెళ్లలేదు.
Also Read: బయటపడుతున్న వంశీ పాపాలు
ఇక ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వెళ్లే అవకాశం ఉండటంతో అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అన్నమయ్య జిల్లాలో.. అటవీ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. దీనితో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను త్వరగా తీసుకురావాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నా సరే ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవడం ఏంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. కర్ణాటక వద్ద కుంకి ఏనుగులు దాదాపుగా 40 కి పైగా ఉండగా.. వాటిలో నాలుగు ఏనుగులను తొలి దశలో తీసుకురావాలని భావించారు. అయినా సరే ఇప్పటివరకు దీనిపై.. స్పష్టత లేదు.




