కూటమి కోట బీటలు వారుతోందా..? 15 ఏళ్లు కలిసి ఉంటామన్న పొత్తు.. పది నెలలకే తెగిపోయేలా ఉందా..? అసలు కూటమి పార్టీలను విడగొట్టేందుకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి రాక ముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించడం రాజకీయ నేతల నైజం. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ – జనసేన – బీజేపీలు జత కట్టాయి. ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అనేది అక్షర సత్యం. కూటమి అభ్యర్థి గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేశారు.
Also Read : ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నా..వైఎస్ సునీత సంచలన కామెంట్స్
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ 20 వేలు పైనే వచ్చిందంటే.. అది ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదు. ఇదే విషయం అప్పట్లో అన్ని పార్టీల నేతలు ఒప్పుకున్నారు కూడా. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. మాటలో తేడా కూడా వస్తోంది. మేము 15 ఏళ్లు కలిసే ఉంటామంటున్నారు పవన్ కల్యాణ్. నా సోదరుడు పవన్ కల్యాణ్ అంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అయితే కిందిస్థాయిలో మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదానికి బీజం పడింది జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ నాడు. మార్చి 14న చిత్రాడలో జరిగిన బహిరంగ సభలో మెగా బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. పవన్ గెలుపు పిఠాపురం ప్రజలతో పాటు జనసేన నేతలు, కార్యకర్తల వల్లే జరిగిందని.. ఎవరైనా తమ వల్ల అని అనుకుంటా.. వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read : జనసేన వల్ల టీడీపీకి లాభమా.. నష్టమా..?
అలాగే 40 ఏళ్ల పార్టీని గెలిపించామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి ఆజ్యం పోశాయి. అసలు ఎవరు ఎవరి వల్ల గెలిచారో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేలా ప్రముఖ సర్వే నిపుణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలోనే కాదు.. ఎక్కడైనా సరే.. ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించేది ప్రజలు, పార్టీ కార్యకర్తలే.. అంటూ ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీడీపీ మద్దతు లేకుండా పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు లాంటి చోట్ల జనసేన గెలుపునకు ఛాన్స్ లేదన్నారు. “కొన్నిచోట్ల జనసేన వల్ల టీడీపీ మెజారిటీ సాధించింది. ఫైనల్లీ కూటమి మైత్రి వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చాం అనుకోవడం ఓ భ్రమ.
Also Read : బాబు 4.0.. బీ కేర్ ఫుల్..!
జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల మీద ఏహ్య భావంతో మీరు అఖండ విజయం సాధించారు. గుర్తుంచుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు వైసీపీ సాధించిన ఓట్ల శాతం కూడా జ్ఞప్తికి వస్తే మీరు మూలాలు మరిచిపోరు.” అంటూ ప్రవీణ్ పుల్లట వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే “టీడీపీ కష్టకాలంలో జనసేనాని ఆదుకున్నారు. జనసేన ఎక్కువ సీట్లు సాధించడంలో టీడీపీ కార్యకర్తల శ్రమ ఉంది. మిమ్మల్ని విడగొట్టడానికి ఎవరో రానక్కర్లేదు. మీ భాగస్వామ్య పార్టీ చాలు.” అంటూ ముగించారు. దీని ద్వారా జనసేనకు సున్నితంగా చురకలు అంటించినట్లు అయ్యింది. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ముందుగానే చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట ఒకరు. దీంతో ప్రస్తుతం ప్రవీణ్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.




